Reading Time: < 1 minute

ధర్మపురి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయండి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Caption of Image.

జగిత్యాల టౌన్, వెలుగు: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 27 నుంచి మార్చి 11 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు. శనివారం ధర్మపురిలోని టీటీడీ ధర్మశాలలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, వైద్య శిబిరాలు, అంబులెన్స్ తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. 

మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గోదావరి తీరం వద్ద భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. 

అదనంగా బస్సులు నడపడం, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. 350 మంది పోలీసులతో 24 గంటల బందోబస్తు ఏర్పాటు చేస్తామని, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపడతామని పేర్కొన్నారు. అనంతరం మంత్రి బ్రహ్మోత్సవాల వాల్​పోస్టర్, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు.

©️ VIL Media Pvt Ltd.