Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి కలకలం.. రేగళ్ల రేంజ్ నుంచి ఆళ్ళపల్లి రేంజ్ లోకి…

Caption of Image.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. జిల్లాలోని ఆళ్ళపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో శనివారం  ( ఫిబ్రవరి 21 ) పెద్దపులి సంచరించినట్లు గుర్తించారు అటవీశాఖ అధికారులు. పెద్దపులి రేగళ్ల రేంజ్ నుంచి ఆళ్ళపల్లి రేంజ్ లోకి ప్రవేశించినట్లు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. ఈ క్రమంలో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

​రైతులు, కూలీలు ఎవరూ పంట పొలాలవైపు వెళ్లోద్దని..​పశువుల కాపరులు కూడా అటవీ ప్రాంతం వైపు వెళ్లోద్దని హెచ్చరించారు అధికారులు. ​గ్రామస్తులు ఒంటరిగా తిరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు ఫారెస్ట్ అధికారులు.

ఇటీవల కాలంలో  పులల సంచారం కొన్ని గ్రామాల్లో రైతులకు కునుకు లేకుండా చేస్తోంది. అడవుల నుంచి దారి తప్పి గ్రామాల్లోకి వస్తున్న పులులు పశువులపై పంజా విసురుతున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో మంగళవారం ( ఫిబ్రవరి 17 )  చిరుతపులి కలకలం రేపింది. గ్రామానికి చెందిన వోరేం సుధాకర్, గుర్రాల మల్లయ్యలకు చెందిన మూడు లేగదూడలపై దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న రైతులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు చిరుత పాదముద్రలను పరిశీలించారు. నాలుగు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలంల అల్లిపూర్, విఠలాపూర్ గ్రామాల పరిధిలో చిరుత సంచారం ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. దానిని పట్టుకునేందుకు పుణె నుంచి వచ్చిన ప్రత్యేక బృందంతో పాటు అటవీ అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అధికారులు గ్రామస్తులకు సూచించారు.

©️ VIL Media Pvt Ltd.