Reading Time: 2 minutes
Mr Work From Home Telugu Movie Review Rating

త్రిగుణ్ హీరోగా, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మోడీ ఇటీవల వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మళ్లీ తీసుకురావాలని ప్రకటన తీసుకురావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద కూడా పడింది. చలికాని మధు దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాని అరవింద్ నిర్మించారు. సుమారు 5 ఏళ్ల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ కథ:
అమెరికాలో ఉద్యోగం వదిలేసుకుని భారతదేశానికి తిరిగి వచ్చిన అరవింద్ (త్రిగుణ్), ఉద్యోగం కాదు జనానికి ఉపయోగపడేలా ఏదైనా బిజినెస్ చేయాలి అని భావిస్తూ ఉంటాడు. తన అపార్ట్‌మెంట్‌లోనే ఉండే మహి (పాయల్ రాధాకృష్ణ)ను చూసి మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ప్రేమకు ఎలా ఉన్నా పర్లేదు కానీ, పెళ్లికి మంచిగా సెటిల్ అయిన అబ్బాయి కావాలని భావిస్తూ ఉంటుంది. అయితే, అరవింద్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్న మహి ముందు అతనితో ప్రేమలో పడుతుంది. కానీ, అరవింద్ ఉద్యోగం చేయడం లేదని తెలుసుకుని అతనితో గొడవలు అవుతాయి. అయితే ఇంట్లో కూడా అరవింద్ ఉద్యోగం చేయకపోవడంతో తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తారు. అలా బయటకు వెళ్లిన అరవింద్, మహిని పెళ్లి చేసుకున్నాడా? అసలు ఈ సినిమాకు ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అనే టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? ఇంటి నుంచి బయటకు వెళ్లిన అరవింద్ చివరికి ఏం చేశాడు లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలుపెట్టి రిలీజ్ కావాల్సిన సినిమా, ఎన్నో కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రారంభం నుంచి కూడా ఇది ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు అనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ చాలా సింపుల్. తాను అనుకున్నది అనుకున్నట్టుగా తెరమీదికి తీసుకురావడంలో పూర్తిస్థాయిలో తడబడ్డాడు. నిజానికి ఉద్యోగం కాదు వ్యాపారం బెటర్ అని చెప్పాలనుకున్నాడో, లేక వ్యవసాయం గొప్పతనం చెప్పాలనుకున్నాడో, లేక డబ్బున్న వారిని కాదు నచ్చిన వారిని ప్రేమించాలి అని చెప్పాలనుకున్నాడో అర్థం కాక కథను ఈ అంశాల చుట్టూ తిప్పిన ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడా కొత్తదనం లేకుండా సినిమా మొత్తం సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల విషయానికొస్తే.. ఈ సినిమాలో త్రిగుణ్ అరవింద్ పాత్రలో ఆకట్టుకున్నాడు. అతనికి ఇలాంటి తరహా పాత్రలు కొత్తేమీ కాదు. పాయల్ రాధాకృష్ణకి ఇది ఒక రకంగా మొదటి సినిమానే, అందుకే ఆమె ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించింది. ఇక అనీష్ కురువిళ్ళ, సత్య కృష్ణ, సి.వి.ఎల్ నరసింహారావు వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే మాత్రం, సినిమాటోగ్రఫీ కొంతవరకు కలర్‌ఫుల్‌గా అనిపించింది. అయితే సినిమాని మాత్రం ఒకే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది. అక్కడక్కడ కొన్ని పొలాలకు సంబంధించిన విజువల్స్ చూపించినా కూడా, ఎందుకో సినిమా మొత్తం చుట్టేసిన ఫీలింగే కలుగుతుంది.

ఫైనల్లీ: ఈ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఫుల్లీ ఔట్‌డేటెడ్.