
Kassim Nassoro: సాధారణంగా టీ20 క్రికెట్‌లో బంతుల లెక్కన వేగవంతమైన హాఫ్ సెంచరీలు చూస్తుంటాం. కానీ, నిమిషాల పరంగా చూస్తే టాంజానియాకు చెందిన విధ్వంసకర ఆల్ రౌండర్ కాసిమ్ నాసోరో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2021 నవంబర్ 6న కామెరూన్‌తో జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో నాసోరో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. క్రీజులోకి వచ్చిన కేవలం 16 నిమిషాల్లోనే ఆయన అర్థశతకాన్ని పూర్తి చేసి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి లెక్కల ప్రకారం సమయం పరంగా ఇదే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా నిలిచింది.
310 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డ నాసోరో..
ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో కాసిమ్ నాసోరో బంతులను బాదిన తీరు చూసి స్టేడియంలోని వారంతా నోరెళ్లబెట్టారు. కేవలం 19 బంతుల్లోనే 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆయన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన స్ట్రైక్ రేట్ ఏకంగా 310.52గా నమోదైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టాంజానియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కామెరూన్ జట్టు కేవలం 62 పరుగులకే కుప్పకూలడంతో టాంజానియా 178 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.
ఎవరీ కాసిమ్ నాసోరో?
టాంజానియాలోని దార్ ఎస్ సలామ్ నగరంలో 1988లో జన్మించిన కాసిమ్ నాసోరో ఆ దేశపు స్టార్ ఆల్ రౌండర్. కుడిచేతి వాటం బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్‌లోనూ ఆయన మేటి. ఇప్పటివరకు టాంజానియా తరపున 79 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన నాసోరో 913 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లోనూ సత్తా చాటుతూ 51 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ, ఆయన ప్రదర్శిస్తున్న వేగం, ఫిట్‌నెస్ యువ ఆటగాళ్లకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. క్రికెట్ చరిత్రలో నిమిషాల లెక్కన నమోదైన ఈ రికార్డును అధిగమించడం ప్రస్తుత తరం ఆటగాళ్లకు పెను సవాలుగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..