Reading Time: < 1 minute

యమునా నదిలో చేయగలరా?..ప్రధాని బోటు షికారుపై మమతా బెనర్జీ సెటైర్

Caption of Image.
  • హూగ్లీ నది క్లీన్​గా ఉంది కాబట్టే చేశారని కామెంట్
  • తన తర్వాతి టార్గెట్‌‌ ఢిల్లీనేనని తేల్చిచెప్పిన బెంగాల్ సీఎం

కోల్‌‌కతా/హౌరా: ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ పర్యటనలో భాగంగా హూగ్లీ నదిలో బోటు ప్రయాణం చేయడాన్ని ప్రస్తావిస్తూ సీఎం మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘హూగ్లీ నది నీరు శుభ్రంగా ఉంది కాబట్టే ప్రధాని ఇక్కడ ప్రశాంతంగా బోటు షికారు చేయగలిగారు.. అదే ఢిల్లీలోని యమునా నదిలో ఆయన ఇలాంటి ప్రయాణం చేయగలరా?’ అని ప్రశ్నించారు. శుక్రవారం హౌరాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ.. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం యమునా నదిని పూర్తిగా కాలుష్యమయం చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం, కోల్‌‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కలిసి హూగ్లీ తీరాన్ని సుందరీకరించాయని తెలిపారు. ఇక్కడి స్వచ్ఛమైన వాతావరణాన్ని చూసి ప్రధాని మురిసిపోతున్నారని, తన ముక్కు కింద ఉన్న యమునను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

కేంద్రంలో బీజేపీని కూలగొడ్త

బెంగాల్‌‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక.. తన తర్వాతి టార్గెట్‌‌ ఢిల్లీనే అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌‌ కాంగ్రెస్‌‌(టీఎంసీ) గెలుపు ఖాయమని దీమా వ్యక్తం చేశారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని స్పష్టం చేశారు. శుక్రవారం కోల్‌‌కతాలోని చౌరంగీ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు.

తాము అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, బెంగాల్‌‌లో బీజేపీ ఓటమి ఖాయమని అన్నారు. తాను చేయబోయే ప్రయత్నం అధికారం కోసం కాదని, బీజేపీని పూర్తిగా నిర్వీర్యం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. ఓటమి భయంతోనే బీజేపీ టీఎంసీ నాయకులపై నిఘా పెట్టిందని ఆరోపించారు. బీజేపీలో చేరిన ప్రతిఒక్కరి వివరాలు కూడా తనకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అందరి సంగతి తేలుస్తానని హెచ్చరించారు. 

©️ VIL Media Pvt Ltd.