
- బెంగాల్‌లో బీజేపీదే గెలుపు..
- ఫస్ట్ ఫేజ్‌లోనే మార్పు పవనాలు.. రికార్డు స్థాయిలో పోలింగ్ ప్రజాస్వామ్య విజయం: మోదీ
- ప్రజాస్వామ్య దేవాలయాన్ని టీఎంసీ ధ్వంసం చేసింది
- ప్రజలు ఓటుద్వారా ఆ దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్నారు
- మే 4 తర్వాత టీఎంసీ గూండాలకు చోటు దొరక్కుండా చేస్తా
- బీజేపీని ఆశీర్వదిస్తే నవ బెంగాల్‌ను నిర్మిస్తామని హామీ
కోల్‌కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘మార్పు పవనాలు’ స్పష్టంగా కనిపిస్తున్నాయని, తొలి దశ పోలింగ్‌తోనే రాష్ట్రంలో బీజేపీ విజయ శంఖారావం పూరించిందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన నియంతృత్వ ధోరణితో బెంగాల్‌లో ప్రజాస్వామ్య దేవాలయాన్ని ధ్వంసం చేసిందని ఆరోపించారు. తమ ఓటు హక్కు ద్వారా రాష్ట్ర ప్రజలు ఆ దేవాలయాన్ని మళ్లీ నిర్మించడం ప్రారంభించారని పేర్కొన్నారు.
శుక్రవారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని దమ్ దమ్ నియోజకవర్గ పరిధి పానిహతి, జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని బరుయిపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు. ‘‘తొలి దశ పోలింగ్‌లో బెంగాల్‌లో స్పష్టమైన మార్పు కనిపించింది. బీజేపీకి లభించిన మద్దతు పార్టీ విజయానికి నాంది పలికింది. టీఎంసీ అణచివేసిన ప్రజాస్వామ్య దేవాలయాన్ని ప్రజలు తిరిగి ప్రతిష్టిస్తున్నారు. ఇప్పుడు రెండో దశలో మీరు ఈ దేవాలయంపై విజయ కేతనాన్ని ఎగురవేయాలి” అని పిలుపునిచ్చారు.
టీఎంసీపై విమర్శలు
తొలిదశ పోలింగ్ తర్వాత టీఎంసీ శ్రేణుల్లో వణుకు మొదలైందని, అందుకే ఆ పార్టీ రాత్రంతా తన గూండాలను రంగంలోకి దించిందని మోదీ ఆరోపించారు. ఫస్ట్ ఫేజ్‌తో టీఎంసీ మార్కు ‘మహా జంగిల్ రాజ్’ అంతమైందని వ్యాఖ్యానించారు. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. టీఎంసీ గూండాలకు దాక్కోవడానికి చోటు కూడా దొరకదని హెచ్చరించారు. ఆర్జీకర్ హత్యాచార బాధితురాలి తల్లిని బీజేపీ పానిహతి అభ్యర్థిగా నిలబెట్టిందని, కూతురిని కోల్పోయిన ఆ తల్లికి న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సందేశ్‌ఖాలీలో అన్యాయానికి గురైన మహిళకు కూడా నాయకత్వం వహించే అవకాశాన్ని కల్పించామని మోదీ గుర్తుచేశారు.
బెంగాల్ అస్తిత్వాన్ని టీఎంసీ నాశనం చేసింది
మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 15 ఏండ్లుగా రాష్ట్రాన్ని దోచుకుందని, అవినీతి, చొరబాట్లతో బెంగాల్ అస్తిత్వాన్ని దెబ్బతీసిందని మోదీ ఆరోపించారు. ఉపాధ్యాయ నియామకాలు, చిట్‌ఫండ్, బొగ్గు, ఇసుక మైనింగ్‌లాంటి కుంభకోణాల్లో నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. బెంగాల్‌లో చొరబాటుదారులను ప్రోత్సహించడం వల్ల స్థానికుల భూములు, ఉపాధికి ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘ఒకవైపు టీఎంసీ అవినీతి, మరోవైపు చొరబాటుదారుల ఒత్తిడి.. ఈ కారణాల వల్లే బెంగాలీ యువత అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోంది” అని పేర్కొన్నారు. ఒకప్పుడు విద్యా విలువలకు మారుపేరుగా ఉన్న జాదవ్‌పూర్ యూనివర్సిటీ.. ఇప్పుడు అరాచకానికి కేంద్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను చదువుకు దూరం చేసి రాజకీయ నిరసనల్లోకి నెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లను ఆ పార్టీ వ్యతిరేకించిందని మోదీ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్‌లోని ప్రతి సోదరీమణి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని గుర్తు చేస్తూ.. భయం, అవినీతి, నిరుద్యోగం నుంచి బెంగాల్‌కు విముక్తి కల్పించి ‘నవ బెంగాల్’ను నిర్మిస్తామని, కమలం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
హుగ్లీ నదిలో మోదీ బోటు షికారు
శుక్రవారం ఉదయం హూగ్లీ నది తీరంలో మోదీ కాసేపు ప్రశాంతంగా గడిపారు. బోటు ప్రయాణం చేస్తూ, గంగా మాతకు తన కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కెమెరా పట్టుకొని హూగ్లీ నది అందాలను, ఐకానిక్ హౌరా బ్రిడ్జ్, విద్యాసాగర్ సేతులను ఫొటోలు తీశారు.