Reading Time: < 1 minute
Rythu Bharosa 2026 Eligibility Documents Application Process Telangana

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ పథకానికి సంబంధించి నూతన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. సాగు పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే కొత్త రైతులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

ఎవరు అర్హులు..?

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా నిబంధనల ప్రకారం 2026 ఫిబ్రవరి 28 నాటికి తమ పేరు మీద భూమి పట్టా పాస్ బుక్ పొందిన వారు అర్హులుగా పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులలో (ధరణి లేదా సంబంధిత పోర్టల్) భూమి వివరాలు నమోదై.. డిజిటల్ సంతకం ప్రక్రియ పూర్తయిన రైతులు మాత్రమే అర్హులు. ఇప్పటివరకు రైతు భరోసా పొందని వారు లేదా ఫిబ్రవరి 28 తర్వాత కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు…

కొత్తగా అర్హత సాధించిన రైతులు పలు పత్రాల జిరాక్స్ కాపీలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి (AEO) సమర్పించాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా.. నూతన పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ ఉండాలి.

Also Read:Weather Update: బిగ్ అల‌ర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

గతంలోనే రైతు భరోసా పొందుతున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉండటంతో.. నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయి. కొత్తగా పాస్ బుక్ పొందిన వారు సాగు కాలం ప్రారంభానికి ముందే ఏఈవోలను సంప్రదించి తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. పథకంలో అర్హులైన ప్రతి రైతుకూ న్యాయం జరిగేలా డిజిటల్ రికార్డుల ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.

రైతు భరోసా పథకం ద్వారా అందే పెట్టుబడి సాయం రైతులు విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరుతున్నారు. రైతు భరోసా పథకం ద్వారా ఒక ఎకరాకు రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.12 వేలు జమ చేస్తున్న విషయం తెలిసిందే.