
హైదరాబాద్: అంతర్జాతీయ సైబర్‌క్రైమ్ నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కంబోడియా నుంచి వస్తుండగా.. చెన్నై విమానాశ్రయంలో నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు విశాఖకు చెందిన పెదపూడి ప్రసన్నకుమార్‌గా గుర్తించారు. మ్యాట్రిమోనియల్, క్రిప్టో ఇన్వెస్ట్ మోసం కేసులో అతడు ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. షాదీ డాట్ కామ్ ద్వారా నకిలీ ప్రొఫైల్ సృష్టించి బాధితులతో పరిచయం ఏర్పరచుకున్నాడని పోలీసులు తెలిపారు. యువతిగా నటిస్తూ పెళ్లి చేసుకుంటానన్న హామీతో మోసాలు చేశాడని అన్నారు. నకిలీ క్రిప్టో ట్రేడింగ్ ద్వారా పెట్టుబడి పెట్టాలని ప్రలోభాలకు గురి చేసినట్లు గుర్తించారు. ఒక బాధితుడి నుంచి రూ.11 లక్షలు కాజేసినట్లు విచారణలో తేలింది. విత్‌డ్రాకు ప్రయత్నించే వారిని మరింత పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. అక్రమంగా సుమారు 500 సిమ్‌లు సేకరించి నకిలీ ఖాతాలను తెరిచినట్లు పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ సైబర్ మోసగాళ్ల ముఠాతో ఈ నిందితుడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.