Reading Time: < 1 minute

గూడూరు అడవుల్లో రహస్య తవ్వకాలు..యువకులు ప్రశ్నించడంతో పరారైన దుండగులు

Caption of Image.

గూడూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అటవీ ప్రాంతాల్లో అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు రహస్యంగా తవ్వకాలు జరపడం కలకలం రేపింది. గుప్తనిధుల కోసమే తవ్వకాలు జరిపారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రెండు కార్లు, ఒక బైక్, ఒక జేసీబీతో అటవీ ప్రాంతానికి చేరుకుని అర్ధరాత్రి రెండు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు. మొదటగా భూపతిపేట శివారు రాళ్లవాగు సమీపంలో జాతీయ రహదారి పక్కన తవ్వకాలు చేశారు. ఈ సమయంలో సీతానగరం గ్రామపంచాయతీ భూక్య దసృ తండాకు చెందిన కొంతమంది యువకులు వారిని గమనించి వివరాలు అడిగారు.

‘మేము అధికారులం.. ఇక్కడి నుంచి బియ్యం లారీ వెళ్తుందనే సమాచారంతో వచ్చాం’ అని చెప్పడంతో యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది దూరంలోనే అటవీ ప్రాంతంలో జేసీబీ సాయంతో మళ్లీ తవ్వకాలు చేస్తున్నట్లు గమనించి వారిని ప్రశ్నించారు. బియ్యం లారీ కోసం వచ్చిన అధికారులు అయితే అడవిలో తవ్వకాలు ఎందుకు చేస్తున్నారని నిలదీయడంతో వారు తడబడ్డారు. యువకులు వెంటనే గూడూరు అటవీ శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే ఆ వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. అటవీ ప్రాంతంలో రెండు చోట్ల సుమారు 8 అడుగుల లోతుతో గుంతలు తవ్వినట్లు గుర్తించారు.

©️ VIL Media Pvt Ltd.