Reading Time: 2 minutes
Fuel Price Hike Impact On Milk Pulses Transport And Daily Expenses

Fuel Price Hike: దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత దేశంలో ఇంధన ధరలు పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు శుక్రవారం లీటరుకు సుమారు రూ. 3.39 వరకు పెంచాయి. అయితే, ఇదే చివరి పెంపు కాదని, ముడిచమురు సంక్షోభం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో లేదా నెలల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ఇంధన ధరల పెంపు ప్రభావం కేవలం వాహనదారులకే పరిమితం కాదు. డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు భారీగా పెరుగుతాయి. మన దేశంలో కూరగాయలు, పండ్లు, పాలు, ధాన్యాలు వంటి నిత్యావసర వస్తువులన్నీ లారీలు, వ్యాన్‌ల ద్వారానే రవాణా అవుతాయి. రవాణా భారం పెరగడంతో సహజంగానే ఆ ప్రభావం వస్తువుల ధరలపై పడుతుంది. ఇప్పటికే అమూల్, మదర్ డెయిరీ సంస్థలు పాల ధరలను లీటరుకు రూ. 2 పెంచగా, దానికి ప్రధాన కారణం రవాణా ఖర్చులేనని పేర్కొన్నాయి. ఇది అంతిమంగా సామాన్యుడి వంటగది బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తుంది.

పెట్రోల్ ధరల పెంపుతో సొంత వాహనాలు వాడేవారికి నెలవారీ ఖర్చులు పెరుగుతాయి. మరోవైపు డీజిల్ ధరల వల్ల బస్సు ఛార్జీలు, క్యాబ్, ఆటో ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కేవలం ప్రయాణమే కాదు, మనకు అలవాటైన స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థల డెలివరీ చార్జీలు సైతం పెరగవచ్చు. కంపెనీలు తమపై పడే అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి డిస్కౌంట్లను తగ్గించడం లేదా డెలివరీ ఫీజులను పెంచడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇంధన ధరల సెగ నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తగిలే ప్రమాదం ఉంది. రైతులు సాగు కోసం వాడే ట్రాక్టర్లు, నీటి పంపులు పూర్తిగా డీజిల్‌పైనే ఆధారపడి ఉంటాయి. డీజిల్ ధర పెరిగితే వ్యవసాయ పెట్టుబడి వ్యయం పెరిగి, రైతులకు లాభాలు తగ్గడమే కాకుండా ఆహార ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. పెరుగుతున్న ముడిచమురు ధరల దృష్ట్యా ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే పిలుపునిచ్చారు. చమురు సరఫరా ఖరీదైనదిగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో, ధరల పెరుగుదల అనివార్యమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం అంటే కేవలం వాహనాలకే కాదు, నిత్యావసరాల నుంచి విలాసాల వరకు ప్రతి అంశంపై భారం పడుతుంది.