
Chanakya Niti: భారతీయ మహా మేధావి, రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు అందించిన మార్గదర్శకాలు ఈ ఆధునిక కాలానికి కూడా సరిగ్గా సరిపోతాయి. మనిషి తన జీవితంలో విజయం సాధించాలన్నా, ప్రత్యర్థులపై పైచేయి సాధించాలన్నా కేవలం శారీరక బలం ఒక్కటే ఉంటే సరిపోదని, వివేకం కూడా చాలా ముఖ్యమని చాణక్యుడు చెప్పారు. మీ శత్రువుల కంటే మీరు ఎల్లప్పుడూ ఒక అడుగు ముందుండటానికి చాణక్య నీతి చెబుతున్న ఆ కీలక విషయాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Almond Protest: బాదం తిని ఫైల్ గుర్తు చేసుకోండి.. ఫైల్ మరచిపోయిన అధికారికి బాదంతో యువకుడి నిరసన
మీరు ఏదైనా విజయం సాధించాలనుకున్నా లేదా శత్రువును దెబ్బతీయాలనుకున్నా, మీ ప్లాన్స్ అత్యంత రహస్యంగా ఉండాలి. మీ మనసులో ఏముందో, మీ నెక్ట్స్ స్టెప్ ఏంటో మీ శత్రువుకు ఊహకు కూడా అందకూడదు. వ్యూహం బయటపడితే శత్రువు అప్రమత్తమవుతాడు, అదే రహస్యంగా ఉంటే మీరు వారిని సులభంగా చిత్తు చేయవచ్చు. చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ప్రత్యర్థిని బలహీనుడిగా భావించడం. శత్రువు చిన్నవాడైనా, పెద్దవాడైనా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అతివిశ్వాసం ఓటమికి దారితీస్తుంది. కాబట్టి ప్రత్యర్థి సామర్థ్యాన్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకుండా, నిరంతరం అప్రమత్తంగా ఉండటమే తెలివైన వాడి లక్షణం.
యుద్ధంలోనైనా, వ్యాపారంలోనైనా శత్రువును ఓడించాలంటే ముందుగా మీకు వారి బలహీనతలు, వారి ఆలోచనా తీరుపై ఒక అవగాహన ఉండాలి. వారు ఏ పరిస్థితిలో ఎలా స్పందిస్తారు? వారి నెక్ట్స్ స్టెప్ ఏవిధంగా ఉండే అవకాశం ఉంది, వారి వ్యూహం ఏమై ఉంటుంది? అనే విషయాలను విశ్లేషించగలగాలి. శత్రువు పద్ధతులు మీకు అర్థమైతే, వారిని కట్టడి చేయడం మీకు చాలా సులభం అవుతుంది. మీ శత్రువు ఒక్కసారిగా చాలా తీయగా మాట్లాడుతున్నాడంటే దాని వెనుక ఏదో మర్మం ఉందని గ్రహించాలి. స్నేహపూర్వకంగా నటిస్తూ వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించే వారి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వారి మాటలకు మోసపోయి గుడ్డిగా నమ్మితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సమాజంలో శాంతి, న్యాయం, వ్యక్తిగత ఎదుగుదల కోసం చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే, జీవితంలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొని విజయతీరాలకు చేరుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు.