Reading Time: < 1 minute
Free UPSC Coaching 2026: నిరుపేద యువతకు భలే ఛాన్స్.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు

అమరావతి, ఫిబ్రవరి 9: ప్రతిష్టాత్మక యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఉచితంగా కోచింగ్‌ ఇచ్చేందుకు పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ ముందుకు వచ్చింది. వెంకటపతి విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా యువతకు సివిల్స్ ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, ఏపీ పశువైద్యమండలి బోర్డు అధ్యక్షుడు డాక్టర్ పీవీ లక్ష్మయ్య ఓ కార్యక్రమంలో తెలిపారు. కొత్త పేటలోని పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో విశ్రాంత సైనికుడు, సామాజిక సేవకుడు సీబీఆర్ ప్రసాద్ సహకారంతో మొత్తం వంద మంది పురుషులు, వంద మంది మహిళలకు ఉచి తంగా యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు శిక్షణ ఇస్తామని వివరించారు. పురుష అభ్యర్ధులకు వినుకొండలో, మహిళ అభ్యర్ధులకు ఇబ్రహీంపట్నం, విజయవాడలో తరగతులు ఉంటాయని వివరించారు.

శిక్షణ సమయంలో అభ్యర్ధులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామని అన్నారు. డిగ్రీ చదివిన 32 సంవత్సరాలలోపు అభ్యర్థులు సివిల్స్‌ ఉచిత శిక్షణకు అర్హులని తెలిపారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి కలిగిన వారు మార్చి 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 78120 51669 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు మార్చి 5న ప్రవేశ పరీక్ష నిర్వహించి వెనువెంటనే ఫలితాలు వెల్లడిస్తామన్నారు. అనంతరం ఎంపికైన వారికి మార్చి 10 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

కేవలం యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణ మాత్రమే కాకుండా ఈ సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతోంది. 6 నుంచి 12వ తరగతి వరకు చదువుకునే పేద విద్యార్థుల కోసం ఉచిత పాఠశాలలను నిర్వహిస్తుంది. అలాగే బాలికలు, బాలురకు వేర్వేరు ఆవాస, నివాస వసతి ఉంటుంది. బాలలకు వినుకొండలో, బాలికలకు ఇబ్రహీంపట్నంలో, విజయవాడలో ఉచిత పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యతోపాటు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.