Reading Time: < 1 minute
Sahil Wakode Death Father Demands Arrest Of Iit Bombay Professor Doolla Director Kedare

IIT బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య వ్యవహారం సంచలనంగా మారింది. తన కొడుకు నిరంతరం బెదిరింపులు ఎదుర్కొన్నాడని, కుల వివక్ష, వేధింపుల ఒత్తిడికి గురయ్యాడని ఆయన తండ్రి రవీంద్ర వాకోడే ఆరోపించారు. ప్రొఫెసర్ సూర్యనారాయణ, ఐఐటీ బాంబే డైరెక్టర్ శిరీష్ కేదారే బెదిరింపులకు పాల్పడ్డారని, వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న 22 ఏళ్ల సాహిత్ తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇదిలా ఉంటే, సాహిల్ పరీక్షా సమయంలో మొబైల్‌లో ప్రశ్నాపత్రానికి సమాధానాలు వెతుకుతూ పట్టుబడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అతను ఆత్మహత్యకు పాల్పడటంతో కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది. సాహిల్ తండ్రి మాట్లాడుతూ.. తన కుమారుడిపై గతేడాది నుంచి ప్రొఫెసర్ దుల్లా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. తన కుమారుడిని టార్గెట్ చేసి, కులపరమైన వ్యాఖ్యలు, బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఆరోపణల ఆధారంగా దుల్లా, కేదారేలను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 13న తన కుమారుడిని కలిసిన సమయంలో, ప్రొఫెసర్ దుల్లా కులంపై వ్యాఖ్యలు చేశాడని చెప్పినట్లు రవీంద్రా తెలిపారు. దుల్లా తనను తాను ‘‘అప్పర్ కాస్ట్’’, సాహిత్‌ను ‘‘లోయర్ కాస్ట్’’గా పేర్కొన్నట్లు ఆరోపించారు. తన కుమారుడు చాలా కాలంగా ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. ఇదిలా ఉంటే, ఐఐటీ బాంబే మాత్రం క్యాంపస్‌లో కుల వివక్ష జరిగిందనే ఆరోపణల్ని ఖండించింది.

సాహిల్ పరీక్ష సమయంలో మొబైల్ ఉపయోగించి చాట్‌జీపీటీలో ప్రశ్నలకు సమాధానాలు పొందేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సాహిల్ తండ్రి రవీంద్ర స్పందిస్తూ.. పరీక్షలో చీటింగ్ జరిగిందనే వాదనకు ఆధారాలు చూపాలని అన్నారు. ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. పరీక్షా సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, సూర్యనారాయణ దూల్లాకు ఫ్యాకల్టీ మద్దతు ప్రకటించింది.