Reading Time: 2 minutes
Hyderabad:  హైదరాబాద్‌లో భారీ వర్షం.. పీక్‌ అవర్‌లో ట్రాఫిక్‌ జామ్‌లు

హైదరాబాద్‌ను వర్షం ముంచెత్తుతోంది. వాయుగుండం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం పీక్‌ అవర్‌లో వర్షం మొదలవడంతో ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఇప్పటికే వాహనదారులకు రెయిన్‌ అలర్ట్‌ జారీ చేశారు. రాగల గంటలో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో సాయంత్రం 5:45 గంటల నుంచి 7 గంటల మధ్య తీవ్ర నుంచి అత్యంత తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

అదే సమయంలో జూబ్లీహిల్స్‌, గోల్కొండ, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ ప్రాంతాల్లోనూ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీక్‌ అవర్‌ కావడంతో ట్రాఫిక్‌ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. భారీ వర్షం సమయంలో అత్యవసరం అయితే తప్ప వాహనాలతో బయటకు రావొద్దని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. తప్పనిసరిగా ప్రయాణించాల్సి వస్తే వాహన వేగాన్ని తగ్గించి, ముందున్న వాహనానికి సురక్షిత దూరం పాటించాలని కోరారు. ఆకస్మికంగా బ్రేకులు వేయడం, అవసరం లేకుండా లేన్లు మార్చడం చేయొద్దని సూచించారు.

ఫ్లైఓవర్ల కింద, నీరు నిలిచే అవకాశం ఉన్న ప్రాంతాల్లో వాహనాలను నిలిపివేయవద్దని పోలీసులు హెచ్చరించారు. భారీ వర్షం సమయంలో హెడ్‌లైట్లు, ఇండికేటర్లను వినియోగించాలని, వీలైనంత వరకు నీటితో నిండిన రహదారులను తప్పించుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు, అధికారిక డైవర్షన్‌ మార్గదర్శకాలను పాటించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్‌ వాసులు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకుని.. తప్పనిసరి పరిస్థితుల్లో నెమ్మదిగా, జాగ్రత్తగా ప్రయాణించడం సురక్షితం.

ఇక హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్‌మెంట్. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది.