Reading Time: < 1 minute
Father Dies During Kanyadan At Daughter Wedding

Wedding Tragedy : కన్నకూతురిని అత్తారింటికి పంపిస్తూ, ఆమె సుఖీభవ అని దీవించాల్సిన ఆ పవిత్ర క్షణమే ఆ తండ్రికి ఆఖరి క్షణమైంది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా సింధ్‌ఖేడ్ రాజా తాలూకా వరదడి గ్రామంలో జరిగిన ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది. పెళ్లి సందడితో కళకళలాడుతున్న ఆ ఇల్లు క్షణాల్లోనే శోకసంద్రంగా మారింది.

వరదడి గ్రామానికి చెందిన కురుమదాస్ కుండలిక్ భూతేకర్ (50) తన కూతురు నందినికి జల్నా జిల్లాకు చెందిన ప్రదీప్ నానోటేతో వివాహం నిశ్చయించారు. బుధవారం (మే 13) సాయంత్రం వివాహ వేడుకలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయి. మంగళావాయిద్యాల మధ్య కన్యాదానం చేసే కీలక ఘట్టం ప్రారంభమైంది. తన కూతురి చేయిని వరుడి చేతిలో పెడుతూ కన్యాదానం చేస్తున్న సమయంలోనే కురుమదాస్‌కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంట్లో పెళ్లిమండపంలోనే ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఐదు నెలల క్రితమే ఆయనకు బైపాస్ సర్జరీ జరిగినట్లు సమాచారం.

తన కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనేది కురుమదాస్ కల. అందుకే పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకున్నారు. పసుపు కొట్టే వేడుక నుండి పెళ్లి తంతు వరకు అంతా సంతోషంగానే సాగింది. కానీ కూతురి అత్తారింటికి పంపేలోపే ఆ తండ్రి లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఏ ఇంటి నుండి కూతురి బారాత్ కదలాల్సి ఉందో, అదే ఇంట తండ్రి అంతిమయాత్ర మొదలవ్వడం చూసి బంధువులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు.

కురుమదాస్ భూతేకర్ గ్రామంలో మంచి వ్యక్తిగా, కష్టపడే మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఒకవైపు నవ దంపతులు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వేళ, తండ్రి ఇలా అకస్మాత్తుగా దూరం కావడం ఆ కుటుంబంలో తీరని లోటును మిగిల్చింది. కూతురి జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు ఆమెకు తీరని వేదనను మిగిల్చిన రోజైంది.