Reading Time: 2 minutes
Ram Pothineni Directorial Debut Rapo 23 Announcement

RAPO 23 : తెలుగు సినీ పరిశ్రమలో ‘ఎనర్జిటిక్ స్టార్’గా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో రామ్ పోతినేని (RAPO). ‘దేవదాసు’ హీరోగా మొదలైన రామ్ ప్రయాణం.. తనదైన నటనతో, చలాకీతనంతో, అదిరిపోయే డాన్సులతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకునేలా చేసింది. అయితే, ఇన్నాళ్లూ తన నటనతో కెమెరా ముందు మ్యాజిక్ చేసిన రామ్.. ఇప్పుడు తన కెరీర్‌లో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇకపై కేవలం హీరో మాత్రమే కాదు.. దర్శకుడు కూడా! రామ్ హీరోగా నటిస్తున్న 23వ చిత్రం (#RAPO23)కి సంబంధించి అభిమానులకు ఒక పవర్‌ఫుల్ అప్‌డేట్ సిద్ధమైంది. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కెమెరా ముందు యాక్షన్ చేస్తూనే, కెమెరా వెనుక ‘యాక్షన్’ చెప్పబోతున్నారు. రామ్ సినీ ప్రయాణంలో ఇదొక పవర్‌ఫుల్ టర్న్ అని చెప్పాలి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు (మే 15వ తేదీ) ఉదయం 10:08 గంటలకు అట్టహాసంగా వెలువడనుంది. రామ్ స్వయంగా తానొక దర్శకుడిగా మారాను అనే విషయాన్ని రేపు అధికారికంగా ప్రకటించనున్నారు.

రామ్ ఉన్నట్టుండి మెగాఫోన్ పట్టుకున్నారు? అయితే వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. వాస్తవానికి రామ్ గతంలో తన కోసం తానే ఓ పవర్‌ఫుల్ స్టోరీని రాసుకున్నారు. కథ అయితే సిద్ధమైంది కానీ, దాన్ని తాను ఊహించిన విధంగా, ఆ కథలోని ఎమోషన్‌ను పర్ఫెక్ట్‌గా స్క్రీన్‌పై ప్రెజెంట్ చేయగల దర్శకుడి కోసం ఆయన చాలా కాలం పాటు వేట సాగించారు. పలువురు దర్శకులను సంప్రదించినప్పటికీ, తన కథను తాను అనుకున్న స్థాయిలో డీల్ చేయగల దర్శకుడు ఆయనకు దొరకలేదట. తన కథలోని ఆత్మను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి తానే కావడంతో, చివరకు ఆ బాధ్యతను తన భుజాలపైనే వేసుకోవాలని రామ్ గట్టి నిర్ణయించుకున్నారు.

తన డ్రీమ్ ప్రాజెక్టును తానే స్వయంగా డైరెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యి, ఇలా తొలిసారి మెగాఫోన్ పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు ‘ఖైదీ’, ‘విక్రమ్ వేద’ ఫేమ్ సామ్ సీఎస్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయిన వెంటనే, అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఒక హీరో దర్శకుడిగా మారడం అనేది ఎప్పుడూ ఆసక్తికరమే. అందులోనూ రామ్ లాంటి ఎనర్జిటిక్ పర్సన్ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ.. రచయితగా, దర్శకుడిగా, హీరోగా మల్టీ టాలెంట్స్ చూపిస్తూ పాత్రలు పోషించబోతుండటం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రేపు ఉదయం రాబోయే అధికారిక ప్రకటనతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు రానున్నాయి. అభిమానులు ఈ “డైరెక్టర్ రామ్” కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.