Reading Time: < 1 minute
Mla Ramakrishna Reddy Backs Pm Modis Savings Call Urges Public To Reduce Gold Purchases

దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పొదుపు పిలుపును ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. రాజమండ్రిలో రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, యుద్ధ పరిస్థితుల ప్రభావం నేపథ్యంలో దేశ విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. బంగారం దిగుమతులపై భారీగా విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతోందని, అందుకే అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గించి పొదుపు వైపు ప్రజలు దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు.

1967లో ఇందిరాగాంధీ ప్రభుత్వం గోల్డ్ కంట్రోల్ ఆర్డర్ అమలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా బంగారం కొనుగోళ్లు తగ్గించాలని పిలుపునిచ్చారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రధాని మోడీపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. దేశ విదేశీ మారక నిల్వలు బలంగా ఉండటం ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలని సూచించారు. అలాగే ప్రధాని మోడీ తన భద్రతా కాన్వాయ్‌ను కూడా తగ్గించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కాన్వాయ్ ఖర్చులను తగ్గించాలని నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ విమర్శల కంటే దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడడం అందరి బాధ్యత అని ఆయన అన్నారు.