
కాంగ్రెస్ నాయకులు, అధికారుల జేబులు నింపడానికే కొత్త భూభారతి పోర్టల్
స్కామ్ వెనుక ఉన్న పెద్ద తలకాయలను కాపాడేందుకే ఆపరేటర్ల అరెస్ట్
ధరణిని రద్దు చేసి తెచ్చిన భూ భారతితో ప్రజల ఆస్తులకు రక్షణ కరువైంది
ఈ కుంభకోణంపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో లేదా సిట్ తో విచారణ జరిపించాలి
జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్ ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. ధరణి మీద బురదజల్లి భూభారతి తెచ్చామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు ఆ పోర్టల్‌లో జరుగుతున్న కుంభకోణంపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. జనగామ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా భ్రష్టు పట్టించిందో రైతులను ఎలా మోసం చేస్తోందో వివరించారు. ధరణి పోర్టల్‌లో లోపాలున్నాయంటూ పదే పదే విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్ఐసి సాఫ్ట్‌వేర్ తో భూ భారతి తెచ్చామని గొప్పలు చెప్పిందని, కానీ ఆ పోర్టల్ ఇప్పుడు ఖజానాకు గండి కొడుతూ దళారులకు భూ హారతిగా మారిందని దుయ్యబట్టారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పూర్తి డబ్బులు కడుతుంటే, భూ భారతి పోర్టల్ ఎడిటింగ్ ఆప్షన్ వాడుకుని కేవలం 10 శాతం మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి, మిగతా 90 శాతం దళారులు జేబుల్లో వేసుకున్నారని విమర్శలు గుప్పించారు.
37 మండలాల్లో ఈ భూ భారతి కుంభకోణం దర్జాగా నడుస్తుంటే, కనీసం నిఘా వ్యవస్థలకు కూడా తెలియకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యమేని చురకలంటించారు. విలేకరులు వార్తలు రాస్తే తప్ప ముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి ఈ స్కామ్ గురించి సోయి లేదని, ఈ భారీ కుంభకోణం వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద అధికారులు ఉన్నారని, వాళ్ల పేర్లు బయటకు రాకుండా కవర్ చేయడానికే నామమాత్రంగా ఆపరేటర్లను అరెస్ట్ చేసి కేసులు నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడానికి కమీషన్ల మీద కమీషన్లు, సిట్ లు వేస్తున్న రేవంత్ రెడ్డి. ఈ భూ భారతి కుంభకోణంపై, ప్రభుత్వ ఖజానా లూటీపై సిట్ తో విచారణ ఎందుకు జరిపించడంలేదని ప్రశ్నించారు. దీనిపై వెంటనే సిట్ వేసి దోషులను కఠినంగా శిక్షించాలని, ఖజానాకు రావాల్సిన ప్రతి పైసా రాబట్టాలని డిమాండ్ చేశారు. పేలని బాంబులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదలుకొని మండల స్థాయి అధికారుల వరకు అందరూ కలిసి నిషేధిత భూముల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని, లక్షల ఎకరాలను ఉద్దేశపూర్వకంగా నిషేధిత జాబితాలో పెట్టడం, వసూళ్లు కాగానే తీసేయడం ఈ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని, నేడు ఆ జాబితా కోటి ఎకరాలు దాటిందని, హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరు మారడం లేదని ఎద్దేవా చేశారు. అసలు నిషేధిత జాబితాలో ఎన్ని భూములు పెట్టారో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ హయాంలో 6 లక్షల 18 వేల మంది రైతులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా సాదా బైనామాలు చేసి పాస్ బుక్ లు ఇచ్చారని, రెండో విడత కోసం 8 లక్షల 92 వేల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, గతంలో లేని విధంగా భూమి అమ్మిన వ్యక్తి బాండ్ పేపర్ పైన అఫిడవిట్ ఇవ్వాలని అనే కొత్త నిబంధన పెట్టి సాదా బైనామాకు ఉరితాడు బిగించారని హరీష్ రావు మండిపడ్డారు.
ఆ నిబంధన వల్ల ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా సాదా బైనామా కాలేదని, వెంటనే ఆ బాండ్ పేపర్ నిబంధన తొలగించి పెండింగ్ లో ఉన్న 8.92 లక్షల మంది రైతులకు న్యాయం చేయాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని చెప్పి, ఇప్పుడు ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, రిజిస్ట్రేషన్ సమయంలో పాస్ పుస్తకాల కోసం రూ. 300 వసూలు చేస్తున్నారని, కానీ ఆరు నెలలైనా ఒక్క పాస్ బుక్ ఇవ్వడం లేదని, పాస్ బుక్ లేకపోతే ఎరువులు రావు, బ్యాంకు లోన్లు రావు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కెసిఆర్ హయాంలో రిజిస్ట్రేషన్ అయిన వారం రోజులకే పాస్ బుక్ నేరుగా ఇంటికి వచ్చేదని, ఇప్పుడు ఆన్లైన్ అంటారు, ఎన్ఐసి సాఫ్ట్‌వేర్ అంటారు.. ఎందుకు ఇవన్నీ ఫెయిల్ అయ్యాయో రెవెన్యూ మంత్రి సమాధానం చెప్పాలని నిలదీశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పేదలకు ఇచ్చిన లక్ష ఎకరాల ఎస్సి, ఎస్టిల అసైన్డ్ భూములను గుంజుకున్నారని, ప్రతిపక్షాల మీద పగబట్టడం, పేదల ఇళ్లు కూలగొట్టడం, కెసిఆర్ కట్టిన గుళ్లను కూడా కూలగొట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ పనిగా మారిందన్నారు.
వందల కోట్లు పెట్టి క్యాంప్ ఆఫీస్ కట్టుకోవచ్చని, వేల కోట్లతో పార్కులు కట్టొచ్చని, ఫుట్ బాల్ ఆడేందుకు డబ్బులుంటాయని, మూసీలో ఇళ్లు కూలగొట్టి వేల కోట్లు ఇవ్వడానికి డబ్బులుంటాయని, కానీ రైతుల ఖాతాల్లో రైతుబంధు వేయడానికి మాత్రం రేవంత్ రెడ్డికి డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. కెసిఆర్ ఉన్నప్పుడు నమ్మకంగా నాట్లకు ముందే రైతుబంధు వచ్చేదని, రేవంత్ రెడ్డి ఏమో కేవలం ఓట్ల కోసమే రైతుబంధు వేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు ఉంటే కచ్చితంగా రైతుబంధు వేసేవారని, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ నీటిని వినియోగించుకుంటోందని, సాగర్, శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా మన నీళ్లను మళ్లిస్తుంటే రేవంత్ రెడ్డి గుడ్లప్పగించి చూస్తున్నాడు తప్ప ఆపడం లేదన్నారు. కండ్ల గుడ్లు ఊడబీకుతా అని డైలాగులు కొట్టడం కాదు అని, చేతనైతే కేంద్రమంత్రి దగ్గర కూర్చుని ఆ నీటి దోపిడీని అడ్డుకోవాలని సూచించారు. ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారని, ఇలాగే వదిలేస్తే రేపు హైదరాబాద్ కు మంచినీళ్ల కటకట వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సామాన్యుడిపై ధరల భారం పెంచడం నిత్యకృత్యంగా మారిందని, పేదవాడు ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటే దాని మీద పదివేల రూపాయల లైఫ్ టాక్స్ పెంచారని, ఆర్టిసి ఛార్జీలను డబుల్ చేశారని, ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి, మంత్రుల ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజలకు ఏ న్యాయం జరగలేదన్నారు. ధరలు పెంచడం, కమీషన్లు దంచుకోవడం తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకేమీ రాదని హరీష్ రావు విమర్శించారు.