
డాక్టర్ పొన్నం రవిచంద్ర రచించిన ‘తెలంగాణ సినీ ప్రస్థానం’ పుస్తక పరిచయ సభ శుక్రవారం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ ఐఏఎస్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు కె.వి. విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా, దర్శక నిర్మాత వేణు ఊడుగుల ఆత్మీయ అతిథిగా, ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు, దర్శకులు అల్లాణి శ్రీధర్, సినీ పుస్తక రచయిత ఎస్ వీ రామారావు, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ‘తెలంగాణ సినీ ప్రస్థానం’ పుస్తకాన్ని ప్రముఖ రచయిత మామిడి హరికృష్ణకు అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ “తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తకాన్ని తీసుకురావడం సంతోషంగా ఉంది. నాకు తెలంగాణ ప్రాంత సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కానీ పైడి జయరాజ్, ఆయనకు ముందు నుంచే చాలామంది తెలంగాణ ప్రాంత నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిభ చాటారు.
ఇప్పుడు మన టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో కనీసం పది మంది తెలంగాణ వారు ఉండటం విశేషం”అని అన్నా రు. ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు కేవీ విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ “తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తక రచనతో పొన్నం రవిచంద్ర ఒక గొప్ప ప్రయత్నం చేశారు. అలాగే ఆ సినిమాలను తిరిగి మన ప్రేక్షకులు చూసేలా కూడా ఆయన ప్రయత్నం చేయాలని కోరుతున్నా. తెలంగాణలో ఎన్నో కళలు ఉన్నాయి. ఎంతోమంది గొప్ప కళాకారులు ఉన్నారు. వారి ప్రతిభ ప్రపంచానికి తెలిసేలా చేస్తే చాలా బాగుంటుంది”అని తెలిపారు. తెలంగాణ సినీ ప్రస్థానం పుస్తకంలోని సమాచారం ఎంతో విలువైనదని, చాలా విషయాలు తెలుసుకునేలా చేసిందని ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు, ప్రముఖ రచయిత మామిడి హరికృష్ణ, దర్శకుడు వేణు ఊడుగుల, అల్లాణి శ్రీధర్, ఇతర అతిథులు ప్రశంసించారు.