Reading Time: 2 minutes

యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన కొత్త చిత్రం ‘విష్ణు విన్యాసం’. శుక్ర వారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మరోసారి విష్ణు విన్యాసం పని చేసిందా? ప్రేక్షకులకు వినోదం పంచిందా? తెలుసుకుందాం.

కథ: విష్ణు (శ్రీ విష్ణు) ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్. అతడికి జాతకాల పిచ్చి. అడుగు తీసి అడుగు వేయాలన్నా జ్యోతిషుడి సలహా తీసుకుంటాడు. దీని వల్లే అతడికి 30 ఏళ్లు దాటినా పెళ్లవదు. తనకు తగిన అమ్మాయి కోసం చూస్తున్న అతడికి.. తన కాలేజీలోనే లెక్చరర్ అయిన మనీషా (నయన్ సారిక)తో పరిచయం అవుతుంది. కొంచెం విచిత్రంగా ప్రవర్తించే ఆమె.. త్వరగా విష్ణుకు దగ్గరవుతుంది. మనీషాను పెళ్లి చేసుకోవడానికి ఉత్సాహంగా సిద్దమైపోయిన విష్ణుకు.. తన గురించి ఒక ఆశ్చర్యకర విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటి.. అది తెలిశాక విష్ణు ఎలా స్పందించాడు.. చివరికి విష్ణు, మనీషా కలిసి జీవితాన్ని పంచుకున్నారా లేదా అన్నది మిగతా కథ.

కథనం విశ్లేషణ: ‘విష్ణు విన్యాసం’లో జాతకాల పిచ్చి ఉన్న కుర్రాడి పాత్ర వినోదానికి మంచి స్కోప్ ఇచ్చేదే. విష్ణు కూడా ఈ పాత్రలో తనదైన శైలిలో కొంతమేర వినోదాన్ని కూడా పంచాడు. కాకపోతే కథలో హీరో కంటే కీలకమైన హీరోయిన్ పాత్రతో ప్రేక్షకులకు షాకిద్దామని ప్రయత్నించిన రైటర్ కమ్ డైరెక్టర్ యదునాథ్ మారుతీరావు.. ఆ పాత్రను తీర్చిదిద్దే విషయంలో గందరగోళానికి గురై ప్రేక్షకులనూ అయోమయానికి గురి చేశాడు. అర్థరహితంగా అనిపించే హీరోయిన్ పాత్ర.. దాని చుట్టూ నడిపిన అస్తవ్యస్తపు కథ ‘విష్ణు విన్యాసం’లో శ్రీ విష్ణు ప్రభావాన్ని తగ్గించాయి. ‘ విష్ణు విన్యాసం’ సినిమా మొత్తానికి చూస్తే మోస్తారుగా అనిపిస్తుందంతే. ఆసక్తికర కథాకథనాలు రాసుకోలేకపోయాడు దర్శకుడు. కథను హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదలుపెట్టిన దర్శకుడు.. తన పాత్రను పరిచయం చేసిన తీరు చూస్తే ఎంతో ఊహించుకుంటాం. కానీ తన సమస్య గురించి తెలిశాక దీనికా ఇంత బిల్డప్ ఇచ్చారు అనిపిస్తుంది. జాతకంలో తనకున్న సమస్యను జాతకాల పిచ్చి ఉన్న హీరోతో ముడిపెట్టి దాని మీద కామెడీ నడిపించడం వరకు ఓకే.

కానీ హీరో పాత్రను పక్కన పెట్టి చూస్తే.. హీరోయిన్ సమస్య సినిమాలో చూపించినంత తీవ్రమైందైతే కాదు. తన సమస్య గురించి విన్న వాళ్లంతా అంత షాకైపోవడం.. తన కుటుంబ సభ్యులు దాని చుట్టూ అంత రభస- హడావుడి చేయడం.. కనిపించిన వాడినల్లా తనను పెళ్లి చేసుకుంటావా అని హీరోయిన్ అడగడం.. ఇదంతా అతిగా అనిపిస్తుంది. ఇది చాలదన్నట్లు కథానాయికను చైన్ స్మోకర్ గా.. రోజూ మందుకొట్టే తాగుబోతుగా చూపించడంలో ఆంతర్యమేంటో.. ఈ కథకు దాని అవసరమేంటో అర్థం కాదు. లేడీ క్యారెక్టర్లు ఎప్పుడో ఒకసారి మందు కొట్టినట్లు.. దమ్ము లాగినట్లు చూపిస్తే ఓకే కానీ.. ఇలా వాళ్లను వ్యసనపరులుగా చూపించడాన్ని ప్రేక్షకులు అంగీకరించలేరు. ఎంత బలమైన కారణం చూపించినా.. దాన్ని జీర్ణించుకోలేరు. పైగా ఇందులో ఆ సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించలేదు. ఇలా హీరోయిన్ పాత్ర ఆద్యంతం ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తుంటుంది. రధన్ పాటల్లో ఒక్కటీ వినసొంపుగా లేదు. డైరెక్టర్ యదునాథ్ మారుతీరావు కామెడీ వర్కవుట్ చేయగలిగే కథనే ఎంచుకున్నప్పటికీ.. కథనం పరంగా అనుకున్నంతగా మ్యాజిక్ చేయలేకపోయాడు.