Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత ఎవరైనా స్వేచ్ఛగా తమ వృ త్తులను ఎంచుకోవచ్చని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ మావోయిస్టులు ఏ పనిచేసుకున్నా ప్రభుత్వానికి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే చట్టం అందరికీ సమానమేనని, చట్టాలు ఉల్లంఘిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని సిఎం రేవంత్‌రెడ్డి మాజీ మావోయిస్టులతో చర్చల అనంతరం మీడియాతో పేర్కొన్నారు. మావోయిస్టుల లొంగుబాటుతో పాటు వారి పునరావాసానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వ రలోనే అసెంబ్లీ వేదికగా ప్రకటన చేస్తానని ఆయ న వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులను ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సిఎం తెలిపారు. మాజీ మావోయిస్టుల భద్రత, వారు గౌరవంగా జీవించేలా ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టు నేతలను ముఖ్యమంత్రి అభినందించారు. అడవుల్లో గడిపి ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకున్నందుకు మాజీ మావోయిస్టులకు సిఎం అభినందనలు తెలిపారు. హింస ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని ఆయన వారికి సూచించారు. ప్రజల ఆకాంక్షలు ప్రజాస్వామ్యం ద్వారానే నెరవేరుతాయని సిఎం పేర్కొన్నారు.

మాజీ మావోయిస్టుల అనుభవాన్ని ఎలా వినియోగించుకోవాలన్న

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సచివాలయం వేదికగా మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలు గంటన్నరకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్నలు సిఎం రేవంత్‌తో చర్చలు జరిపారు. ఈ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్లుగా సమాచారం. పొలిటికల్ ఎజెండాపైన పలు రకాలుగా మావోయిస్టులు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ సాయం, ప్రజా సమస్యల గురించి సిఎం రేవంత్‌రెడ్డితో వారు మాట్లాడినట్టుగా సమాచారం. ఒకవైపు రాజకీయ ఎజెండాను చర్చిస్తూనే మరోవైపు శాంతిభద్రతల అంశాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు మాజీ మావోయిస్టుల అనుభవాన్ని సామాజిక మార్పు కోసం ఏ విధంగా వాడుకోవాలన్న కోణంలో ఈ చర్చలు జరిగినట్టుగా తెలిసింది. పొరుగు రాష్ట్రాల తరహాలోనే మెరుగైన పునరావాస ప్యాకేజీలను కల్పించాలని వారు సిఎంకు విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది. చాలాకాలం తరువాత మావోయిస్టు నేపథ్యం ఉన్న నాయకులు ప్రభుత్వంతో చర్చలకు రావడం కొత్త రాజకీయ కోణాలకు దారితీసింది పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజా సమస్యలపై సిఎం ఆరా

మరోవైపు మావోయిస్టు పార్టీ పరిస్థితి, లొంగిపోయిన వారికి ప్రభుత్వ సాయం, ప్రజా సమస్యల గురించి సిఎంతో వారు చర్చించినట్టుగా సమాచారం. గతేడాది అక్టోబర్‌లో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ తన ఆరోగ్యం, ఆర్థిక సమస్యలపై ఇటీవల ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలా లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం, అజ్ఞాతం వీడి జన జీవన స్రవంతిలో కలిసిన వారి జీవన స్థితిగతులు, తమ కోసం ఓ సంక్షేమ పథకం తీసుకురావాలని మాజీ మావోయిస్టు నేతలు సిఎంను కోరినట్టుగా తెలిసింది.

తెలంగాణలో సరెండర్ పాలన బాగుంది: దేవ్‌జీ

దేవ్‌జీ (అలియాస్ తిప్పిరి తిరుపతి) మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిజిపి, ఐజీలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ సరెండర్ పాలన బాగుందని ఆయన ప్రశంసించారు. సాయుధ పోరాటాన్ని వీడి ప్రధాన స్రవంతిలోకి వచ్చేందుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘రివార్డు పాలసీని రూ.కోటికి పెంచాలని సిఎంను కోరామన్నారు. ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. కానీ, ఐదెకరాలు ఇవ్వడం సాధ్యం కాదని సిఎం చెప్పారన్నారు. ఇల్లు, ఉద్యోగం, జీవనభృతిపై సిఎం హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే జైళ్లలో ఉన్న మావోయిస్టులను కలుస్తామని, ఆ తర్వాత లొంగుబాట్లపై అందరం కలిసి ప్రజలకు బహిరంగ లేఖ రాస్తామని ఆయన తెలిపారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తుపాకీ సిద్ధాంతం నడవదని ప్రజలకు వివరిస్తామని దేవ్‌జీ వెల్లడించారు. గతంలో సచివాలయంలోకి మాజీ మావోయిస్టులకు ఎంట్రీ ఉండేది కాదు. కానీ, తాజాగా మాజీ మావోయిస్టు నేతలకు సచివాలయంలోకి సాదర స్వాగతం పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది. డిజిపి శివధర్‌రెడ్డి మాట్లాడుతూ రెండేళ్లలో 591 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన సిఎంతో పేర్కొన్నారు. పోలీసుల సమన్వయం, ప్రభుత్వ పునరావాస విధానాలతో జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డిజిపి శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడిజి విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచీ ఐజీ సుమతి పాల్గొన్నారు.