Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసుతో బిఆర్‌ఎస్ పార్టీ అసెం బ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నష్టపోయిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టిఆర్ అన్నారు. ఆ కేసులో కవితకు న్యాయం జరిగిందని చెప్పారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్, కవితకు క్లీన్ చిట్ ఇస్తూ వచ్చిన తీ ర్పుపై కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. మద్యం కుంభకోణం సాకు తో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారని ఆక్షేపించారు. అదే తరహాలో బిఆర్‌ఎస్ నాయకులపై నమోదైన ప్రతి కేసు కూడా తప్పుడు, రా జకీయ ప్రేరేపిత, కల్పితమని తేలిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ని జం గెలవనంత వరకు కాంగ్రెస్,బిజెపి నుంచి  ఆరోపణలు వస్తూనే ఉంటాయన్నారు. అసత్య పూరిత కుట్రపూరిత కేసులను ఆరోపణలను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దురదృష్టవశాత్తూ, సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యతనిస్తూ, న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్న అనే ధోరణి ఈ నవ భారతంలో అలవాటుగా మారిపోయిందని పేర్కొన్నారు. ఆరోపణలే సాక్ష్యాలు అవుతున్నాయన్నాయని, అయినా చివరికి, న్యాయమే గెలుస్తుందని అన్నారు.

అవినీతి-, అరాచకమే కాంగ్రెస్ పాలన జోడెడ్లు: కెటిఆర్ విమర్శలు

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. నాగర్‌కర్నూల్‌లో రెండు నెలల పసిపాప మరణించిన ఘటన, కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ వంటి ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలు ప్రజలను రోడ్డున పడేసిన దారుణ చర్యలని ఆక్షేపించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బిఆర్‌ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఆలంపూర్ నియోజకవర్గం కౌన్సిలర్లకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి చల్లా వెంకట్రామి రెడ్డి, ఎంఎల్‌ఎ విజయుడు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ఆలంపూర్, ఐజ, గద్వాల, వడ్డేపల్లి ప్రాంతాల్లో బిఆర్‌ఎస్‌కు ప్రజలు అందించిన మద్దతు విశేషమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ నడిగడ్డలో మాత్రం ప్రజల విశ్వాసం ఇప్పటికీ బిఆర్‌ఎస్‌పైనే ఉందని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం పార్టీ బలాన్ని నిరూపిస్తోందని చెప్పారు.

కెసిఆర్ నాయకత్వంలో గతంలో అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెడ్లలా ముందుకు సాగాయని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి, అరాచకం జోడెడ్లుగా మారాయని విమర్శించారు. చెక్ డ్యామ్‌లు పేల్చడం, పల్లె ప్రకృతి వనాల్లో చెట్ల నరుకులు వంటి చర్యలు రాష్ట్రాన్ని వెనక్కి నెడుతున్నాయని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని, రైతు బంధు, ఎరువుల సరఫరా వంటి అంశాల్లో రైతులను తీవ్రంగా నిరాశపరిచిందని పేర్కొన్నారు. ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్ నిజ స్వరూపం అర్థమైందని అన్నారు. నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రం మొత్తం వ్యాపించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తుందని ముందుగానే హెచ్చరించారు. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోసారి కెసిఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.