Reading Time: < 1 minute

బంగ్లాదేశ్ ప్రధాన కేంద్రంగా శుక్రవారం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూ కంపం ప్రభావం ఆనుకుని ఉండే పశ్చిమ బెంగాల్ ఇతర ప్రాంతాలపై కూడా పడింది. మహానగరం కోల్‌కతా ఇతర బెంగాల్ ప్రాంతాల్లో జనం ఉరుకులు పరుగులతో బయటకు వచ్చారు. మధ్యాహ్నం 1.22 గంటలకు రెక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూ ప్రకంపనలు రికార్డు అయ్యాయని భారత భూకంపాల పరిశోధనా కేంద్రం తెలిపింది. బంగ్లాదేశ్‌లోని సత్కీరా జిల్లాలో భూమిలోపల పది కిలోమీటర్ల అడుగున భూ కంప ప్రధాన కేంద్రం నెలకొన్నట్లు గుర్తించారు.

ఈ ప్రాంతం కోల్‌కతాకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. సరిహద్దు జిల్లా ప్రాంతం నార్త్ 24 పరగణా జిల్లా లోని టాకీకి ఈ భూకంప కేంద్రం పాతిక కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ పరిధిలోని పలు చోట్ల జనం ప్రకంపనలు ఎదుర్కొన్నారు. దాదాపు పది సెకండ్ల పాటు భూమి కంపించింది. పశ్చిమ బెంగాల్‌లో ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం ఘటనలు జరగలేదు. అయితే పలు ప్రాంతాల్లో అధికార యంత్రాంగం సర్వం సమాయత్తంగా ఉంది.