Reading Time: < 1 minute

భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా మహిళా టీమ్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 20తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 36.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ అలీసా హీలీ ఆరు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. అయితే మరో ఓపెనర్ లిచ్‌ఫీల్డ్, వన్‌డౌన్‌లో వచ్చిన జార్జియా వోల్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. వరుస ఫోర్లతో స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు టీమిండియా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఇటు లిచ్‌ఫీల్డ్ అటు వోల్ అద్భుత షాట్లతో చెలరేగి పోయారు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన లిచ్‌ఫీల్డ్ 62 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 80 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ఇదే క్రమంలో రెండో వికెట్‌కు 119 పరుగులు జోడించింది. మరోవైపు కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న వోల్ 82 బంతుల్లోనే 13 బౌండరీలు, ఒక సిక్స్‌తో 101 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. బెథ్ మూనీ (31), ఆష్లే గార్డ్‌నర్ 19 (నాటౌట్) తమవంతు సహకారం అందించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను ఓపెనర్లు ప్రతీక రావల్ (52), స్మృతి మంధాన (31) శుభారంభం అందించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (54) పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించింది. మిగతా వారు విఫలం కావడంతో భారత్ స్కోరు 251 పరుగులకే పరిమితమైంది.