Reading Time: < 1 minute

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు.ఈ కేసులో అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును వెలువరించిందని తెలిపారు. న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని వివరించారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని తాను ఎన్నోసార్లు చెప్పానని గుర్తు చేశారు. ఈ కేసు వల్ల తాను, తన కుటుంబం 5 నెలల పాటు క్షోభ అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. తన కుటుంబానికి దూరమై, 5 నెలలు జైలులో గడిపిన సమయాన్ని ఎవరు తిరిగిస్తారని ప్రశ్నించారు. కోర్టు తీర్పు రాకుండానే కొందరు అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు. తనపై పెట్టిన కేసులపై మూడేళ్లుగా ఒంటరిగానే పోరాడుతున్నానని తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి తనకు ఎప్పుడూ మద్దతు రాలేదన్నారు. తాను రాజకీయ పార్టీ పెట్టే ముందే కోర్టు తీర్పు రావటం సంతోషకరమన్నారు.