Reading Time: < 1 minute

టి20 ప్రపంచకప్ సూపర్8లో ఇంగ్లండ్ వరుసగా మూడో విజయం సాధించింది. శుక్రవారం న్యూజిలాండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ ఓటమితో కివీస్ తన సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. 160 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విల్ జాక్స్ 32 (నాటౌట్), రెహాన్ 19 (నాటౌట్) జట్టును గెలిపించారు. టామ్ బాంటన్ (33), బ్రూక్ (26) తమవంతు పాత్ర పోషించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు టిమ్ సిఫర్ట్, ఫిన్ అలెన్ శుభారంభం అందించారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరు పోటీ పడి షాట్‌లు కొట్టడంతో స్కోరు వేగంగా పరిగెత్తించింది. దూకుడుగా బ్యాటింగ్ చేసిన సిఫర్ట్ 25 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. ఆ వెంటనే అలెన్ కూడా పెవిలియన్ చేరాడు. 19 బంతుల్లో 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కివీస్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. రచిన్ రవీంద్ర (11), మార్క్ చాప్‌మన్ (15), డారిల్ మిఛెల్ (3), కెప్టెన్ సాంట్నర్ (9), మెక్ కొన్చి (14) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఫిలిప్స్ 39 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో రెహాన్, రషీద్, జాక్స్ రెండేసి వికెట్లను పడగొట్టారు.