Reading Time: < 1 minute

హైదరాబాద్: తాను చెప్పింది నిజమని ఇవాళ కోర్టు తీర్పుతో తేలిందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. లిక్కర్ కేసు నుంచి తాను నిర్దోషిగా బయటపడటంపై ఆమె మాట్లాడారు. తనను ఐదు నెలలు జైలులో ఉంచి మానసికంగా వేధించారని.. తప్పు తేలకుండానే తన వ్యక్తిత్వ హననం చేశారని మండిపడ్డారు.

‘‘ఎక్స్‌లో నా అన్న కెటిఆర్ పెట్టిన పోస్టు చూశాను. నాపై పెట్టిన కేసు వల్లే బిఆర్ఎస్ ఓడిందన్నట్లుగా పోస్టు చేశారు. బిఆర్ఎస్ నేతలను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి నేను కారణమా? ప్రజలకు ఇళ్లు, ఉద్యోగాలు, ఇవ్వకపోవటం బిఆర్ఎస్ ఓటమికి కారణం. అభ్యర్థులను మార్చకుండా మళ్లీ వాళ్లకే టికెట్లు ఇవ్వటం కారణం. దోపిడీదారులకే మళ్లీ టికెట్లు ఇచ్చి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా మీ అహంకార ధోరణే పార్టీ ఓటమికి కారణం.

ఇవాళ కోర్టు తీర్పును మీకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడుతున్నారు. బిఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేయాలని చూడటం కరెక్ట్ కాదు. కెటిఆర్.. ఇప్పటికైనా మీరు ప్రజల తీర్పును గౌరవించాలి. వాస్తవాలు ఒప్పుకొని మీ లోపాలను సరి చేసుకోవాలి. ఎన్నికలప్పుడు ఏం జరిగిందో మర్చిపోయి నన్ను బ్లేమ్ చేయొద్దు. బిఆర్ఎస్ పార్టీ నుంచి నాకు ఎప్పుడూ మద్ధతు రాలేదు. నాపై పెట్టిన కేసులపై మూడేళ్లుగా ఒంటరిగానే పోరాడుతున్నా. మరో మూడు నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నా. పార్టీ పెట్టే ముందే కోర్టు తీర్పు రావటం సంతోషకరం. సొంతంగా పార్టీ పెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. పిడికెడు మందితోనే రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా మారుతా.

బిజెపి, బిఆర్ఎష్ రెండు ఒకటే మళ్లీ చెప్పాల్సిన పని లేదు. కేవలం ఒక వ్యక్తి వల్ల ఓడిపోయేంత బలహీనంగా పార్టీ ఉందా? వైఫల్యాలను విస్మరించి ఓటమిని నా మెడలో వేస్తున్నారు. ఆడబిడ్డను అవమానించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని కవిత అన్నారు.