
హుబ్లీ: తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన జమ్ము కశ్మీర్ జట్టు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. తొలిసారి ఫైనల్‌కు చేరుకున్న ఈ జట్టు విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జమ్ము కశ్మీర్ జట్టు 584 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో కర్ణాటక 293 పరుగులకే ఆలౌటై 291 పరుగుల వెనుకంజలో పడిపోయింది.
దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్ము కశ్మీర్ జట్టు 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ పకడ్బందీగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. 160 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సుతో 94 పరుగులు చేసి ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 57 ఓవర్లలో జమ్ము కశ్మీర్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు 477 పరుగల ఆధిక్యంలో ఉంది. క్రీజ్‌లో ఇక్బాల్‌తో పాటు సాహిల్ (16) ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో జమ్ము గెలుపు ఇక లాంఛనమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.