Reading Time: < 1 minute

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో మంత్రికి ప్రత్యేక ప్రోటోకాల్ దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకుని డిప్యూటి సిఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు భట్టికి వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ రంగారావు డిప్యూటి సిఎంకు అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. దర్శనం అనంతరం డిప్యూటి సిఎం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజుతో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.