Reading Time: < 1 minute

కెపిహెచ్‌బిలో గజం భూమి ధర రూ. 2.65 లక్షలు పలికింది. 1,400 ఎస్‌ఎఫ్‌టి ఉన్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌కు రూ. 1.10 కోట్ల ధర పలకడంతో మరోసారి రికార్డు ధరలకు హౌసింగ్ బోర్డు భూములు, ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. భూములు, ఫ్లాట్ల విక్రయంతో రూ.24.26 కోట్ల మేర ఆదాయం హౌజింగ్‌బోర్డుకు సమకూరింది. ఈ నేపథ్యంలోనే హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్ల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు పోటీ పడ్డారు. ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది, డిమాండ్ ఉన్న కెపిహెచ్‌బి ప్రాంతంలోని ప్లాట్లు, ఫ్లాట్లను బహిరంగం వేలంలో రికార్డు ధరలకు కొనుగోలు చేశారు. ఫేజ్-1, 2 లోని ధర్మారెడ్డి కాలనీలోని 4 ఓపెన్ ప్లాట్లు, ఫేజ్ -15 లోని సంపూర్ణం అపార్ట్‌మెంట్ లోని 8 ఫ్లాట్లకు శుక్రవారం హౌజింగ్‌బోర్డు అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు.

ఓపెన్ ప్లాట్ల ద్వారా రూ.15.81 కోట్లు

మొత్తం 40 మంది కొనుగోలుదారులు పాల్గొన్న ఈ వేలం పాటలో ఎల్‌ఐజి కేటగిరీకి చెందిన ప్లాట్ చదరపు గజం కనీస ధర రూ. 1.30 లక్షలుగా నిర్ధారించగా, చదరపు గజం రూ.2.65 లక్షలకు అమ్ముడుపోయిందని, మరో ప్లాట్ ను చదరపు గజం రూ.2.41 లక్షలకు కొనుగోలు చేశారని హౌసింగ్ బోర్డు వైస్‌చైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం పాటలో తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకోడానికి బిడ్డర్లు (కొనుగోలుదారులు) పోటీ పడ్డారని ఆయన తెలిపారు.

అదే విధంగా సంపూర్ణం అపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న ఫ్లాట్లకు రూ .90 లక్షలను అప్‌సెట్ ధరగా నిర్దారించగా వీటిని కొనుగోలు చేయడానికి కూడా బిడ్డర్లు పోటీ పడి గరిష్టంగా రూ.1.10 కోట్లు, అలాగే ఇతర ఫ్లాట్లను రూ.1.08 కోట్లు, రూ.1.07 కోట్లు, రూ. 1.06 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ విధంగా శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ. 24.26 కోట్ల మేర ఆదాయం వచ్చిందని వైస్‌చైర్మన్ విపి గౌతం వివరించారు. ఇందులో ఓపెన్ ప్లాట్ల ద్వారా రూ.15.81 కోట్లు, సంపూర్ణం అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ల ద్వారా రూ. 8.45 కోట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు.