Reading Time: 2 minutes

ఎపిలో బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సుదీర్ఘ కాలంగా సిబిఐ ఆధీనంలో ఉన్న ఆయేషా శరీర అవశేషాలను విజయవాడలోని సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో గుండెలు అవిసేలా రోదించిన తల్లిదండ్రులను చూసి అక్కడి వారు చలించిపోయారు. ఆయేషా మీరా హత్య జరిగి సుమారు రెండు దశాబ్దాలు కావస్తున్నా, ఇప్పటికీ అసలు హంతకుడెవరో తేలకపోవడం గమనార్హం. గతంలో ఈ కేసులో సత్యంబాబును నిందితుడిగా భావించినప్పటికీ, కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత సిబిఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టినప్పటికీ సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసును మూసివేసు ్తన్నట్లు కోర్టుకు వెల్లడించింది. తమ బిడ్డకు న్యాయం జరగలేదని, కనీసం ఆమె అవశేషాలనైనా అప్పగించాలని తల్లిదండ్రులు కోరడంతో కోర్టు ఈ మేరకు అనుమతినిచ్చింది. 2019లో ఈ కేసు విచారణలో భాగంగా శాస్త్రీయ ఆధారాల కోసం ఆయేషా మీరా భౌతిక కాయానికి సిబిఐ రీ-పోస్టు మార్టం నిర్వహించింది. ఆ సమయంలో ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఆమె శరీర భాగాలు, అవశేషాలను సేకరించి భద్రపరిచారు.

ఇప్పుడు కేసు విచారణ ముగియడంతో ఆ అవశేషాలను తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ భాషాలకు అప్పగించారు. ఈ అవశేషాలను తమ సొంత ఊరు తెనాలికి తీసుకువెళ్లి అక్కడ ఇస్లాం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయేషా మీరా తల్లిదండ్రులకు మద్దతుగా మహి ళా , మానవ హక్కుల సంఘాలు కోర్టు వద్ద ఆందోళన చేపట్టాయి. సాక్ష్యాలను తారుమారు చేసిన అధికారులు, అసలు నిందితులపై ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదని వారు మండిపడ్డారు. 19 ఏళ్ల పోరాటం తర్వాత కూడా హంతకుడిని పట్టుకోలేకపోవడం వ్యవస్థల వైఫల్య మేనని ప్రజా సంఘాల నేతలు విమర్శించారు. డబ్బు, అధికారం ఉన్న వారిపై ఆయేషా తల్లిదండ్రులు ఇన్నేళ్లుగా చేసిన పోరాటం సామాన్యమైనది కాదని బాధితులకు మద్దతుగా నిలిచిన నేతలు కొనియాడారు. ఎన్నో బెదిరింపులు ఎదురైనా, ఏ ప్రభుత్వాలు అండగా నిలవకపోయినా తమ బిడ్డకు న్యాయం కోసం వారు అలుపెరగని పోరాటం చేశారని పేర్కొన్నారు. చివరికి హంతకుడిని శిక్షించలేకపోయినా, తమ బిడ్డ అవశేషాలకైనా గౌరవ ప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం లభించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తల్లిదండ్రుల ఆవేదన

ఆధారాలు ఉన్నాయని, ఎఫ్‌ఐఆర్‌లో వయస్సు కూడా తప్పుగా నమోదు చేశారని ఆయేషా తల్లిదండ్రులు ఆరోపించారు. నేరం జరిగిన తర్వాత అన్ని తుడిచేశారని, అయేషా కేసులో పోలీసులు పూర్తిగా నిందితులకు సహకరించారని ధ్వజమెత్తారు. ఆయేషా అవశేషాల కోసం కోర్టుల చుట్టూ ఏళ్ల క్రితం నుంచి తిరిగామని ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే…

ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మహిళల వసతి గృహంలో 2007లో బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన 9 నెలల తర్వాత 2008 ఆగస్టులో సత్యంబాబును ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సత్యంబాబుకు జీవితఖైదు, అత్యాచారం నేరం కింద 10 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ 2010 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సత్యంబాబు 2010 అక్టోబర్‌లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ 2017 మార్చి 31న తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఆయేషా తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశిస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 నవంబర్‌లో ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కేసు మళ్లీ మొదటికే వచ్చినట్ల యింది. ఇప్పుడు సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు కొట్టేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. తమకు న్యాయం జరగలేదంటూ ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.