Reading Time: < 1 minute

టి-20 ప్రపంచకప్‌లో ఆదివారం భారత్‌కి అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. సెమీస్‌కి చేరుకోవాలంటే.. వెస్టిండీస్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది. మరోవైపు వెస్టిండీస్‌కి కూడా ఈ మ్యాచ్ ఎంతో ముఖ్యం.. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ భారత జట్టుకు పలు కీలక సూచనలు చేశారు. వెస్టిండీస్ జట్టును తక్కువ అంచనా వేయొద్దని ఆయన పేర్కొన్నారు.

‘‘దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బతింది. దీంతో టాప్ ఆర్డర్‌లో కుడి-ఎడమ కాంబినేషన్‌ను అమలు చేుయాల్సిన పరిస్థితి వచ్చింది. గత మ్యాచ్‌ల నుంచి పాఠాలను నేర్చుకోవడం అత్యంత ముఖ్యం. ఇప్పుడు విండీస్‌తో సవాల్ భిన్నమైంది. వారు దేనిని తేలిగ్గా తీసుకోరు. వారి బ్యాటర్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లూ రిథమ్‌తో బౌలింగ్ చేస్తున్నారు. ఏదైనా పొరపాట్లు చేస్తే శిక్షించేందుకు సిద్ధంగా ఉంటారు. వారిని కట్టడి చేయాలంటే భారత్‌కు సరైన ప్లాన్ అవసరం. మరీ ముఖ్యంగా ఆ జట్టు బ్యాటింగ్‌పై ఓ కన్నేయాలి. తొలి బంతి నుంచే భారీ షాట్లకు దిగేస్తారు. ఆదివారం మ్యాచ్ తప్పకుండా సూపర్‌గా ఉండబోతుంది’’ అని గవాస్కర్ అన్నారు.