
అమరావతి: వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను, రైతులకు ఆధునిక పరికరాలను పరిచయం చేసి..ప్రోత్సహిస్తున్నామని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పై అధిక దృష్టి పెట్టామని అన్నారు. ఎపి అసెంబ్లీలో సిఎం ప్రసంగించారు. ప్రకృతి సేద్యాన్ని 50 లక్షల ఎకరాలకు విస్తరిస్తామని, రాయలసీమలో 20 లక్షల ఎకరాల్లో హర్టీకల్చర్ సాగు అవుతోందని తెలియజేశారు. దేశంలోనే అత్యధిక పండ్లు పండే ప్రాంతంగా రాయలసీమ ఉందని, రాయలసీమలో హార్టీకల్చర్ ను 40 లక్షల ఎకరాలకు పెంచుతామని సిఎం పేర్కొన్నారు. రాయలసీమ హార్టీకల్చర్ కు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, ఏలూరు దగ్గర అతి పెద్ద కోకో సిటీ వస్తుందని అన్నారు. ఆక్వా ఉత్పత్తిలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్నామని, ఏజెన్సీలో కాఫీ పంట విస్తీర్ణం పెరుగుతోందని చెప్పారు. అతిపెద్ద ఆక్వా కల్చర్ హబ్ గా మన రాష్ట్రం తయారవుతోందని, సమర్థ నీటి నిర్వహణ వల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయని అన్నారు. ఒకే రకం పంట వేయడం వల్ల రైతులు బాగా నష్టపోతున్నారని, రైతులు ముందే మాట్లాడుకుని భిన్నమైన పంటలు వేయాలని సూచించారు. 2029 లోగా అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలనేది తమ లక్ష్యం అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.