Reading Time: 3 minutes

రాష్ట్ర రాజకీయాల్లో రైతు సంక్షేమం ఎప్పుడూ సున్నితమైన అంశం. ముఖ్యంగా పంట పెట్టుబడి సాయంగా అమలులోకి వచ్చిన రైతుభరోసా వంటి పథకాలు కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, ప్రభుత్వాల రాజకీయ నిబద్ధతకు ప్రమాణాలుగా మారాయి. అయితే తాజా పరిణామాలను పరిశీలిస్తే రైతుభరోసా పథకం భవిష్యత్తుపై అనిశ్చితి ముసురుకుంటున్నదనే భావన బలపడుతోంది. డిసెంబర్‌లో ఇవ్వాల్సిన సాయంపై స్పష్టత లేకపోవడం, కేబినెట్ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రాకపోవడం, వ్యవసాయ శాఖ మంత్రి సమావేశానికి హాజరు కాకపోవడం వంటి పరిణామాలు అనేక సందేహాలకు దారి తీస్తున్నాయి. రైతుబంధు పథకాన్ని 2018లో అప్పటి సిఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు.ప్రతి ఎకరానికి సీజన్‌కు నిర్దిష్ట నగదు సాయం అందించడం ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడానికి ముందస్తుమూలధనాన్ని పొందాలన్నది లక్ష్యం. ప్రారంభంలో ఎకరానికి రూ. 4,000గా మొదలై, తరువాత రూ. 5,000కు పెరిగింది. సంవత్సరానికి రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ. 10,000 అందించే విధంగా అమలు జరిగింది. లక్షలాది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు.

భూ యజమాన్య ఆధారంగా సాయం అందించడం వల్ల కౌలు రైతులు లాభోక్తులు కాకపోయినా, భూస్వామ్య రైతులకు ఇది స్థిరమైన ఆదాయ మద్దతుగా నిలిచింది. అయితే ప్రభుత్వ మార్పు తర్వాత రైతుభరోసా కొనసాగింపుపై రాజకీయ చర్చలు ప్రారంభమయ్యాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతుభరోసా కింద గత ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 69 లక్షల 39 వేల మంది రైతులకు రూ. 8,744.13 కోట్ల నిధులను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఎన్నికల సమయంలో రైతు సంక్షేమంపై పలు హామీలు ఇచ్చిన ప్రస్తుత సిఎం అనుముల రేవంత్‌రెడ్డి, పథకాల పునర్వ్యవస్థీకరణ అవసరాన్ని ప్రస్తావించారు. ఆర్థిక పరిస్థితులను సమీక్షించి, నిజమైన లబ్ధిదారులకు లక్ష్యిత సాయం అందించే విధానాన్ని అవలంబిస్తామని తెలిపారు. అయితే డిసెంబర్‌లో ఇవ్వాల్సిన రైతుభరోసా సాయం జాప్యం కావడం రైతుల్లో ఆందోళనకు కారణమైంది. మున్సిపల్ ఎన్నికల ముందు రైతుభరోసా చెల్లింపులపై స్పష్టత రాకపోవడంతో ప్రభుత్వం విమర్శలకు గురైంది. ఎన్నికల అనంతరం, ఫిబ్రవరి 4 తర్వాత రైతుబంధు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

కానీ రైతుభరోసా సాయం మాత్రం ఖాతాల్లోకి చేరలేదు. రైతుభరోసా పథకానికి సంవత్సరానికి వేల కోట్లు వ్యయం అవుతాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని ప్రభుత్వం పలుమార్లు పేర్కొంది. అప్పుల భారం, సంక్షేమ పథకాల విస్తరణ, వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు- ఇవన్నీ కలిపి ఖజానాపై భారాన్ని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో సమగ్ర సమీక్ష లేకుండా రైతుభరోసా విడుదల సాధ్యంకాదనే వాదన అధికార వర్గాల్లో వినిపిస్తోంది. అయితే రైతుల దృష్టిలో ఇది పెట్టుబడి సాయం. పంట పెట్టే సమయంలో నగదు అందకపోతే అప్పుల పాలవ్వాల్సిందేనని వారు వాదిస్తున్నారు. రైతుభరోసా అమలులో కొన్ని నిర్మాణాత్మక లోపాలు ఉన్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. భూ యజమానులకు మాత్రమే సాయం అందించడం వల్ల అసలు సాగు చేసే కౌలు రైతులు ప్రయోజనం పొందలేకపోయారు. పెద్దభూస్వాములు కోట్ల రూపాయల సాయం పొందగా, చిన్నరైతులు పరిమిత లబ్ధితోనే సరిపెట్టుకున్నారు. ఈ అసమానతలను దృష్టిలో ఉంచుకొని పథకాన్ని పునర్నిర్మించాలనే ఆలోచన ప్రభుత్వం వద్ద ఉందని సమాచారం.

అయితే పునర్వ్యవస్థీకరణకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ లేకపోవడం సమస్యగా మారింది. రాజకీయ కోణంలోచూస్తే రైతుభరోసా కేవలం ఆర్థిక పథకం కాదు; అది ఓటు బ్యాంక్ రాజకీయాల్లో కీలక సాధనం. గ్రామీణ ఓటర్లలో ప్రభావం చూపగల శక్తివంతమైన పథకం. ఎన్నికల ముందు హామీలు, తరువాత అమలులో జాప్యం- ఈ వ్యత్యాసం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతోంది. ఇక్కడ మరో ముఖ్య అంశం సమయపాలన. పంట చక్రం ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం ముందుగానే అందాలి. నాట్లు పూర్తయ్యాక డబ్బులు జమ అయితే ఆ ప్రయోజనం తగ్గిపోతుంది. వ్యవసాయం కాలపరిమితి ఆధారిత రంగం. ఒకసారి సీజన్ మిస్ అయితే నష్టం పూడ్చుకోవడం కష్టం. కాబట్టి రైతుభరోసా వంటి పథకాల అమలులో సమయపాలన అత్యంత కీలకం. ప్రస్తుత జాప్యం వల్ల రైతులు ప్రైవేట్ అప్పులవైపు మొగ్గుచూపే ప్రమాదం ఉంది. కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు రాకపోవడం రెండు సందేశాలను ఇస్తోంది.

ఒకటి- పథకంపై తుదినిర్ణయం ఇంకా తీసుకోలేదని. రెండవది- పథకాన్ని రూపాంతరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని. వ్యవసాయ శాఖ మంత్రి గైర్హాజరు కావడం యాదృచ్ఛికమా లేక విధానపరమైన విభేదాల సంకేతమా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అధికారిక స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రైతుభరోసా పూర్తిగా రద్దవుతుందా? లేక సవరింపులతో కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకొని చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే సాయం పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ ఉంది. భూపరిమితి విధించడం, కౌలురైతులను చేర్చడం, ప్రత్యక్ష లబ్ధిదారుల గుర్తింపు వంటి అంశాలపై సమగ్ర డేటా సేకరణ అవసరం. ఈ ప్రక్రియకు సమయం పట్టవచ్చు. కానీ ఆ మధ్యంతర కాలంలో రైతులకు స్పష్టమైన మార్గదర్శకత్వం అవసరం. రైతు సంక్షేమం కేవలం ఎన్నికల హామీలకే పరిమితం కాకూడదు.

అది వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చే దీర్ఘకాలిక విధానంగా ఉండాలి. పెట్టుబడి సాయం, కనీస మద్దతు ధరలు, పంట బీమా, సాగునీటి సదుపాయాలు -ఇవి అన్నీ సమన్వయంతో పనిచేస్తేనే రైతు స్థిరత్వం సాధ్యం. ఒక పథకం జాప్యం మొత్తం వ్యవసాయ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం రైతుల్లో నెలకొన్న అనిశ్చితి తొలగించాలంటే ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. రైతుభరోసా కొనసాగుతుందా? అయితే ఎప్పుడు? ఏ విధానంలో? లేక పునర్నిర్మాణం చేస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. లేనిపక్షంలో రాజకీయ విమర్శలు, రైతుల అసంతృప్తి మరింత పెరుగుతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం తగ్గితే దాని ప్రభావం మార్కెట్లపై కూడా పడుతుంది. మొత్తానికి రైతుభరోసా పథకం భవిష్యత్తు ప్రస్తుతం అనిశ్చితిలో ఉంది. డిసెంబర్‌లో ఇవ్వాల్సిన సాయం జాప్యం, ఎన్నికల తర్వాత హామీల అమలు కాకపోవడం, కేబినెట్‌లో చర్చకు రాకపోవడం- ఇవి కలిపి రైతుల్లో సందేహాలను పెంచుతున్నాయి. ప్రభుత్వం త్వరలో స్పష్టతనిచ్చి రైతుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 

– రామకిష్టయ్య సంగనభట్ల,9440595494