Reading Time: 2 minutes

బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) చరిత్రను వక్రీకరించడం, వివాదాస్పద పాఠ్యాంశాలను ప్రచురించడంలో తన ప్రావీణ్యం చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. రెండు మూడేళ్ల క్రితం గత చరిత్ర లోని వాస్తవాలకు మసిబూసి మారేడుకాయ చేసి ప్రజాగ్రహానికి గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడం తీవ్ర వివాదాస్పదంగా మారి సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టడానికి దారి తీసింది. మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రజాసేవకుల్లోని అవినీతి గురించి ప్రచురించకుండా ప్రత్యేకించి న్యాయవ్యవస్థలోనే అవినీతి జరుగుతున్నట్టు అధ్యాయాన్ని ప్రచురించడంపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు కళంకం తెచ్చేలా ఎవరు ప్రవర్తించినా అనుమతించబోనని, వారెంత ఉన్నత స్థానంలో ఉన్నాసరే చట్టం తనపని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు.

ఈ అంశాన్ని సుమోటోగా గురువారం (26.2.26) విచారణ చేపట్టారు. న్యాయవ్యవస్థ అవినీతిమయమని బోధిస్తున్నారా? అని ఎన్‌సిఇఆర్‌టిని ప్రశ్నించారు. ఈ వివాదాస్పద కంటెంట్‌ను తయారు చేసిన రచయితల పేర్లు, వివరాలు ఇవ్వాలని ధర్మాసనం కోరింది. ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్ దీనిని వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని పేర్కొంది. ఈ పుస్తకాన్ని బుధవారం నిషేధించింది. అసంబద్ధ అంశాలను ప్రచురించినందుకు ఎన్‌సిఇఆర్‌టి ధర్మాసనానికి క్షమాపణ చెప్పింది. ఈ పాఠ్యాంశంతో కూడిన పుస్తకాల పంపిణీని నిలిపివేయాలని ఎన్‌సిఇఆర్‌టిని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ఎన్‌సిఇఆర్‌టి విధానాలు గత రెండు మూడేళ్లుగా వివాదాస్పదంగానే ఉంటున్నాయి. 2022లో 12వ తరగతి పాఠ్యగ్రంథం నుంచి మొత్తం మొగల్ చరిత్ర అధ్యాయాన్నే ఎన్‌సిఇఆర్‌టి తొలగించడంతో దేశవిదేశాలకు చెందిన 250 మంది చరిత్రకారులు తీవ్ర అభ్యంతరం లేవదీశారు. 12వ తరగతి రాజకీయ శాస్త్రం పాఠ్యప్రణాళిక నుంచి సిక్కుల చరిత్రకు సంబంధించిన విషయాలను తప్పుగా పేర్కొన్నదని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ధ్వజమెత్తింది.

స్వాతంత్య్రానంతర భారత రాజకీయాలు పాఠ్యగ్రంథంలో ప్రాంతీయ ఆకాంక్షలు అనే ఉపశీర్షిక కింద ఆనంద్‌పూర్ సాహిబ్ తీర్మానం గురించి తప్పుడు సమాచారం ఎన్‌సిఇఆర్‌టి ఇచ్చిందని ఎస్‌జిపిసి అధినేత హర్జిందర్ సింగ్ ధామి అభ్యంతరం చెప్పారు. 1973 నాటి ఆనందపూర్ సాహిబ్ తీర్మానం రాష్ట్రహక్కుల గురించి, సమాఖ్య వ్యవస్థను పటిష్ఠం చేయడం గురించి ప్రస్తావించిందని అది విస్మరించి సిక్కులను వేర్పాటువాదులుగా చిత్రించడం తగదని ఎస్‌జిపిసి హెచ్చరించింది. అత్యంత అభ్యంతరకరమైన ఈ మార్పులను పాఠ్యగ్రంథాల నుంచి తొలగించాలని ఎస్‌జిపిసి డిమాండ్ చేసింది. 12 వ తరగతి చరిత్ర పాఠ్యగ్రంథం నుంచి మహాత్మాగాంధీకి సంబంధించిన కొన్ని వాస్తవాలను తొలగించినట్టు విమర్శలు వచ్చాయి. హిందూముస్లింల ఐక్యత కోసం మహాత్మాగాంధీ చేసిన కృషి, హిందూ తీవ్రవాదులను ఎలా రెచ్చగొట్టిందో వివరించిన భాగాన్ని, అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై నిషేధం విధించే సమాచారాన్ని తొలగించినట్టు వార్తలు వచ్చాయి. ఇవన్నీ చరిత్రను వక్రీకరించడానికి కాషాయవాదుల పరోక్ష ఆదేశాలతో చేసిన నిర్వాకమే అని స్పష్టమవుతోంది. సిబిఎస్‌ఇ సిలబస్‌లోని 11వ తరగతి సోషియాలజీ పాఠ్యగ్రంథం నుండి గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ప్రస్తావనలను ఎన్‌సిఇఆర్‌టి ఎందుకు తొలగించిందో జవాబులేని ప్రశ్నగా మిగిలిపోయింది.

ఈ విధంగా చరిత్రను వక్రీకరించడం, వాస్తవాలను మరుగుపర్చడం తదితర మార్పులను కేంద్ర ప్రభుత్వం, బిజెపి సమర్ధించుకుంటుండడం ప్రత్యేకించి గమనించవలసి ఉంది. పైగా భారతదేశ చరిత్రకు కాంగ్రెస్ పార్టీయే తప్పుడు భాష్యాలు చెప్పిందని ఆరోపిస్తున్నాయి. ఆ పార్టీ ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను తాము సరిదిద్దుతున్నామని ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రపంచం లోనే అతి గొప్ప దేశంగా భారత్ పరిణామం చెందుతుండగా అప్పుడు, ఇప్పుడు వ్యతిరేక అంశాలు ఏమైనా సరే చరిత్రలో ఉండకూడదన్నదే బిజెపి ప్రభుత్వ ఆలోచన అని మహారాష్ట్ర బిజెపి ప్రముఖులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉంటోంది. చరిత్ర అంటే వాస్తవాలకు సాక్షం చెప్పేది.అంతేకాని పురాణాలు, ఇతిహాసాల మాదిరిగా కల్పించేవి కావు.

భారతదేశ చరిత్ర ఎంతో వైవిధ్యంతో కూడుకున్నది. అనేక వంశాలు, అనేక వర్గాల పాలనలో బహుళత్వంలో ఏకత్వంతో సుసంపన్నమైంది. ఎన్నో మతాలు ఇక్కడ మనుగడ సాగిస్తున్నా సమైక్యతా సూత్రానికే కట్టుబడిన ఘనత ఈ దేశం మట్టిలో జీవం పోసుకున్నది. అటువంటి బహుళత్వాన్ని వక్రీకరించి, ఛిన్నాభిన్నం చేసినంత మాత్రాన వాస్తవాలు చెరిగిపోవు. మత ఛాందసులు తమ విశ్వాసాలకు అనుగుణంగా దేశ ప్రజల సమైక్యతను బలిగొనడం, చారిత్రక, సాంస్కృతిక పరిణామాలను సమాధి చేయడానికి ప్రయత్నించడం ఘోర అపరాధమే అవుతుంది. పాఠశాల స్థాయిలో పిల్లలను చారిత్రకంగా, వైజ్ఞానికంగా తీర్చిదిద్దవలసిన జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి కేంద్ర ప్రభుత్వ మతోన్మాద భావజాలానికి దాసోహం అంటూ వివాదాస్పద అంశాలతో పసిహృదయాల్లో సందిగ్ధ సందేహాలను నాటుకునేలా చేయడం చరిత్ర క్షమించదు. ఇకనైనా పారదర్శకతతో ప్రవర్తిస్తే విద్యార్థులకు మేలు చేసిన వారవుతారు.