Reading Time: < 1 minute

అమరావతి: ఐపిఎస్ సునీల్ నాయక్ అరెస్టుకు సంబంధించిన వారెంట్ చివరి నిమిషంలో గుంటూరు మొబైల్ కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం దీనిపై తీర్పు వెలువడనుంది. సునీల్ అరెస్టు చేసేందుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోర్టుకు పోలీసులు విన్నవించారు. కోర్టులో వాదోపవాదనలు అయిన తరువాత సునీల్ అరెస్టుకు వారెంట్ జారీ చేస్తున్నట్లు కోర్టు తీర్పు వెల్లడించింది. కానీ వారెంట్ పత్రం జారీ కాలేదు. తీర్పు వెల్లడించే సమయంలో సునీల్ నాయక్ తరుఫు న్యాయవాదులు కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్చి 2వ తేదీ వరకు సునీల్ నాయక్ ను అరెస్టు చేయవద్దని బిహార్‌లోని పాట్నా న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చిందని పేర్కొంటూ వారు సంబంధిత పత్రాలు సమర్పించడంతో ఇవాళ్టికి వాయిదా పడింది. మాజీ ఎంపి రఘురామకృష్ణరాజును చిత్రహింసలకు గురి చేసిన కేసులో సునీల్ నాయక్ నిందితుడిగా ఉన్నాడు.

ఆర్ఆర్ఆర్ కేసులో మాజీ సిఎం, వైసిపి అధినేత వైఎస్ జ‌గ‌న్, ఐపిఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పేర్లు చెప్పాల‌ని ర‌ఘురామ‌కృష్ణంరాజు బెదిరించాడ‌ని సునీల్ నాయ‌క్ సంచ‌ల‌న ట్వీట్‌  చేశారు. కావాలనే తనని ఈ కేసులో ఇరికించారని ఐపిఎస్ అధికారి సునీల్ నాయక్ వాపోయారు. ఎస్టిగా పుట్టడమే తాను చేసిన నేరమా? అని ప్రశ్నించారు. మాజీ సిఎం వైఎస్ జగన్ పేరు చెప్పాలని ఫిర్యాదుదారుడు తనకు ఫోన్ చేసి బెదిరించారన్నారు. తన దగ్గర కె రఘురామరాజు ఫోన్ కాల్ రికార్డులు ఉన్నాయని, సరైన సమయంలో ఆధారాలు బయటపెడతానని హెచ్చరించారు. ఆర్ఆర్ఆర్ కాల్ డేటా బయటకు తీస్తే ఎంతమందిని బెదిరించారో తెలుస్తుందని ఐపిఎస్‌ సునీల్ నాయక్ చెప్పిన విషయం తెలిసిందే.

సునీల్ నాయక్ పోస్టును సునీల్ కుమార్ రీట్వీట్ చేశారు. సిబిఐని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. బ్యాంకులను మోసం చేసి రఘురామను అరెస్టు చేయాలని ఐపిఎస్ అధికారి పివి సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. సునీల్ నాయక్‌నే బెదరించారంటే సిబిఐ కేసుల్లో సాక్ష్యులను రఘురామ బెదిరించడం ఇంకా సులభం అని అన్నారు. రఘురామపై రూ.947 కోట్లు, రూ. 238 కోట్లు ఎగ్గొట్టారని అరోపణలు చేయడంతో పాటు ఈ రెండు కేసులను సిబిఐ విచారిస్తోందని, రఘురామ మోసంపై దృష్టి పెట్టాలని సిబిఐని సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.