Reading Time: < 1 minute

కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను చిన్న భిన్నం చేయడంతో పాటు కోట్ల రూపాయాలు కమీషన్లు దండుకుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం గాంధీ భవన్‌లో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మీడియా సెల్ కన్వీనర్ సామ రామ్మోహన్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో అప్పులు తీసుకువచ్చిన గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీరుతో రూ. 47వేల కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో కమీషన్లు దండుకుందని, కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే, ప్రపంచంలోనే ఎక్కడ లేదని చెప్పారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒక్క చుక్క నీరు ఇవ్వలేదని మంత్రి ఆరోపంచారు. కాళేశ్వరంలో చేసిన అవినీతికి ఇతర దేశాల్లో అయితే కఠిన శిక్షలు విధించే వారని మంత్రి ధ్వజమెత్తారు. రైతులకు సంబంధించి రైతు బంధు, మూసీ ప్రక్షాళన గురించి ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనవసరంగా మాట్లాడుతున్నారన్నారు.

ప్రతిపక్ష నాయకులు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ నేతలు ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వంపై బురద జల్లె ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాళేశ్వరం విషయంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి కెటిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమయిన అంశాలు మాట్లాడానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా కెసిఆర్ ఏనాడు అసెంబ్లీకి రాలేదని చెప్పారు. గత ప్రభుత్వంలో ఎస్సి, ఎస్టి విద్యార్ధుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని మంత్రి అడ్లూరి ఆరోపించారు. రెండేళ్ల పరిపాలనతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వెంట ఉన్నారని సహించలేక బిఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తొన్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టె ప్రయత్నంలో భాగంగా కాళేశ్వరం వడ్డీలను తగ్గించడానికి ముఖ్యమంత్రి చోరవ తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేస్తున్నామని మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి తెలిపారు.