Reading Time: < 1 minute

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రహదారి భద్రత పన్ను (రోడ్డు సేఫ్టీ సెస్)ను విధించేందుకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారిపై ఈ పన్నును విధించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరిపై ఈ కొత్త పన్ను విధింపు ఉంటుందని పేర్కొంది. కార్లు, ప్రయాణీకులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర రవాణాయేతర వాహనాలపై ఈ పన్నును విధించనుంది. ద్విచక్రవాహనానికి రూ.2 వేలు, లైట్ మోటారు వాహనాలకు రూ.5 వేలు, ఇతర వాహనాలకు రూ.10 వేల చొప్పున సెస్ విధించేందుకు ఈ కొత్త ఉత్తర్వులను విడుదల చేస్తోంది. వాహనాల రిజిష్ర్టేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రోడ్డు భద్రత పన్ను విధింపు ద్వారా ప్రతి సంవత్సరం సుమారు రూ.270 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. ఇప్పటి వరకు ఉన్న వాహన రిజిష్ర్టేషన్ చార్జీలకు ఇది అదనంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు చెల్లిస్తున్న పన్నులకు అదనంగా ఈ పన్ను చెల్లింపు వాహన వినియోగదారులకు భారం కానుంది.