Reading Time: 2 minutes
Andhra Pradesh Fuel Crisis Petrol Diesel Shortage Hits Districts No Stock Boards At Bunks

Andhra Pradesh Fuel Crisis: ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో అనేక పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఇంధనం కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని సమాచారం. పలు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోవడంతో వాహనదారులు బంకుల వద్ద నిరాశగా వెనుదిరుగుతున్నారు. కొన్నిచోట్ల బంక్ సిబ్బందితో వాహనదారుల మధ్య వాగ్వాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

Read Also: RCB vs GT: మొదటి ఓవర్‌లోనే ట్విస్ట్.. ఆ ఒక్క క్యాచ్.. మ్యాచ్‌నే మార్చేసింది!

ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా ఆయిల్ కంపెనీలు అప్పు ప్రతిపాదికన ఇంధన సరఫరాను నిలిపివేయడమేనని తెలుస్తోంది. పెండింగ్ బకాయిలు చెల్లించిన తర్వాతే సరఫరా పునరుద్ధరిస్తామని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేసినట్లు సమాచారం. పాత బకాయిల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ఈ సంక్షోభం ఏర్పడిందని తెలుస్తోంది. ఇక నష్టాలు, పరిశ్రమల్లో వినియోగం తగ్గుదల కూడా సరఫరాపై ప్రభావం చూపినట్లు చెబుతున్నారు. కొండపల్లి పారిశ్రామిక వాడ సమీపంలో భారీ సంఖ్యలో ట్యాంకర్లు నిలిచిపోయాయి. HPCL, IOCL, BPCL ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద వందల సంఖ్యలో ట్యాంకర్లు స్టాండ్‌స్టిల్‌లో ఉన్నట్లు సమాచారం.

ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు కూడా సరఫరా అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో రవాణా, పరిశ్రమలు, వ్యవసాయం రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంధన సంక్షోభంపై నిన్న విజయవాడలో సివిల్ సప్లైస్ అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఏపీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సంయుక్త సమావేశం నిర్వహించారు. చర్చలు సఫలమయ్యాయని, నిరంతర సరఫరా కొనసాగుతుందని ఆయిల్ కంపెనీలు తెలిపినట్లు డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది. అయితే సమావేశం తర్వాత కూడా పలు బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన కొనసాగుతోంది. సమస్యను వెంటనే పరిష్కరించి సాధారణ సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పలు పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ కోసం వినియోగదారులు, రైతులు, వాహనదారులు టిన్నులతో బారులు తీరుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల సీజన్‌లో ఈ కొరత రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో వరి పంట కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైతులు వరి కోత యంత్రాల సహాయంతో పంట మాసూళ్లలో నిమగ్నమై ఉన్నారు. అయితే కోత యంత్రాలకు అవసరమైన డీజిల్ బంకుల్లో అందుబాటులో లేకపోవడంతో కోత పనులు అంతరాయం కలుగుతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో రైతులు పండించిన పంటను ఎలాగైనా కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో డీజిల్ కొరత మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసిన రైతులు వరి కోత కోసం యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు వాటికి ఇంధనం దొరకకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.