
హైదరాబాద్: ఈసారైనా రాజ్యసభలో తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేత విహెచ్ హనుమంతరావు కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వయసుతో సంబంధం లేకుండా పార్టీ కోసం పని చేస్తున్నానని, ఎక్కడ అన్యాయం జరిగిన అక్కడ తాను ఉన్నానని స్పష్టం చేశారు. గత పదేళ్లుగా పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, ఎలాంటి పదవి లేదన్నారు. అయినా నిరంతరంగా పని చేస్తున్నానని విహెచ్ పేర్కొన్నారు.
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఏర్పడనున్న రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహుల సంఖ్య అధికంగా ఉంది. సీట్లు తక్కువ పోటీ ఎక్కువగా ఉంది. ఖాళీలేర్పడుతున్న స్థానాలకు వచ్చే నెల ఎన్నికల నిర్వహణకు బుధవారం నోటిఫికేషన్ వెలువడింది. దీంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఖాళీలేర్పడనున్న స్థానాల్లో అభిషేక్ మను సింఘ్వి (కాంగ్రెస్), కెఆర్ సురేష్ రెడ్డి (బిఆర్‌ఎస్) ఉన్నారు. వీరి పదవీ కాలం ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు ఉంది. ఇప్పుడు జరగబోయే రెండు స్థానాలూ పార్టీల బలబలాలను బట్టి కాంగ్రెస్ ఖాతాలో చేరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రెండు స్థానాల్లో అభిషేక్ మను సింఘ్విని కొనసాగించాలని పార్టీ అధిష్టానం భావిస్తుందా? అనేది చాలా ముఖ్యమైన అంశం.
ఈ నేపథ్యంలో బిసి నాయకునికి రాజ్యసభ సీటు ఖరారు చేయాలనుకుంటే ఏఐసిసి నాయకుడు మాజీ ఎంపీ వి. హనుమంత రావు ముందు వరసలో ఉంటారు. ఇంకా తాను పిసిసి అధ్యక్ష పదవిని కోరినప్పుడు పార్టీ అధిష్టానం తనకు నచ్చజెప్పిందని, భవిష్యత్తులో మంచి పదవిని ఇచ్చి గౌరవిస్తామని చెప్పిందని మధుయాష్కీ గౌడ్ తన అనుయాయుల వద్ద అన్నారని తెలిసింది.
మార్చి 16న 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక
వచ్చే నెల 16న రాజ్యసభలో 37 స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. ఈ స్థానాలకు ఏప్రిల్, ఏప్రిల్ 9వ తేదీల్లో ఖాళీలు ఏర్పడుతాయి. ఈ ఎగువ సభ ఎన్నికల్లో అధికార బిజెపికి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయి. రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేల బలాబలాల పరిస్థితి , అధికారపక్షం అనుకూలతతో బిజెపినే ఎక్కువ స్థానాల్లో పాగా వేసే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం వివరాల ప్రకారం తెలంగాణలో 2, అత్యధికంగా మహారాష్ట్రలో 7, ఒడిషాలో 4, తమిళనాడులో 6, ఛత్తీస్‌గఢ్‌లో రెండు, పశ్చిమ బెంగాల్‌లో ఆరు, అసోంలో 2, బీహార్‌లో 5 , హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్కస్థానానికి ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ ద్వైవార్షిక ఎన్నికల నోటీఫికేషన్ ఫిబ్రవరి 26వ తేదీనే వెలువడింది. దీని మేరకు పోలింగ్ మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల లోపు జరుగుతాయి. .