Reading Time: 2 minutes

ఢిల్లీ మద్యం కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి సిసోడియాకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడం సంచలనాత్మకం. ఈ కేసులో కవితతోపాటు 23 మంది నిందితులపై తప్పు చేసినట్టు సాక్షాధారాలు లేవని, ఎక్సైజ్ పాలసీలో ఎటువంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశం లేదని కోర్టు స్పష్టం చేయడం కుట్ర రాజకీయాలకు గొడ్డలి పెట్టు. అవినీతి జరగలేదంటూ కేజ్రీవాల్‌తోపాటు మనీష్ సిసోడియాలను కోర్టు నిర్దోషిగా శుక్రవారం (27.2.26) ప్రకటించింది. కేంద్రంలో అధికార చక్రం తిప్పుతున్న కాషాయనాథులు తమ ప్రత్యర్థులు పాలించే రాష్ట్రాల ప్రభుత్వాలను పడగొట్టడానికి ఎలాంటి కుట్రలైనా పన్నుతారని ఈ ఉదంతాలు బట్టబయలు చేస్తున్నాయి. ఈ కుట్రల వల్లనే ఢిల్లీ లోని కేజ్రీవాల్ ప్రభుత్వం కుప్పకూలగా, తెలంగాణ లోని కవితపై ఈ ప్రభావం బిఆర్‌ఎస్ ఓటమికి ఒక కారణమైంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం వల్లనే క్రేజీ సంపాదించిన కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు ఒక ఆశాకిరణంలా కనిపించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రజాప్రయోజనకరమైన ఎన్నో పథకాలను విజయవంతంగా నెరవేర్చగలిగింది.

ఉచితంగా ఉన్నత స్థాయి విద్య, విద్యుత్ సరఫరాతోపాటు మొహల్లా క్లినిక్‌ల ద్వారా ఆరోగ్య సేవలు ప్రజల వద్దకు తీసుకు వెళ్లింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రవేశపెట్టారు. ఢిల్లీ అంటే ఆమ్‌ఆద్మీ కోటగా కేజ్రీవాల్ మార్చగలిగారు. ఇది కిట్టని కేంద్ర పాలకులు భారీ ఎత్తున అవినీతి ఆరోపణలను సంధించారు. ఒకపక్క ఇడి, మరోపక్క సిబిఐలను కుడి ఎడమల కత్తుల్లా ఉపయోగించారు. విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటిపై దాడులు జరిపించారు. ఈ దాడుల్లో అవినీతికి సంబంధించిన పత్రాలు ఏమేమి దొరికాయో, అక్రమంగా ఆర్జించినట్టు ఆరోపిస్తున్న సొమ్ము ఎంత దొరికిందో అలాంటి సమాచారం వెల్లడించవలసి ఉన్నా ఆ పని చేయలేకపోవడంలో మతలబులేమిటో తెలిసిందే. దాడులకు సంబంధించి సిబిఐ ప్రాథమిక అభియోగ పత్రంలో కేవలం రూ. కోటి విలువైన అవినీతి మాత్రమే ఉన్నట్టు పేర్కొనగా, దీనిని సిబిఐ రూ. 8000 కోట్లు నుంచి రూ.11,000 కోట్ల వరకు అవినీతి జరిగినట్టు ప్రచారం చేసింది.

ఇలాంటి బోగస్ ప్రచారం వల్ల సిబిఐ కేసు నిలబడదని ఆనాడే కేజ్రీవాల్, సిసోడియా అంచనా వేశారు. ఆ విధంగానే ఈ రోజు కేసు నిలబడలేకపోవడం గమనించవలసి ఉంది. 2022 ఆరంభంలో ప్రవేశపెట్టి తరువాత ఉపసంహరించుకున్న మద్యం విధానంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ సిబిఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి సిసోడియాను మొదటి ముద్దాయి చేసింది. ఆయనతోపాటు మొత్తం 15 మందిని అందులో చేర్చారు. ప్రైవేట్ మద్యం వ్యాపారులకు లాభాలు చేకూర్చడం ద్వారా ఆప్ ప్రభుత్వం లోని పెద్దలు ఆర్థికంగా ప్రయోజనం పొందడానికే ఆ మద్యం విధానాన్ని ప్రవేశపెట్టారని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనాచే అబద్ధాలు చెప్పించారు. ఆ అబద్ధాల ఆరోపణల ఆధారం గానే ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. మరోవైపు దీనికి ప్రతిగా సక్సేనా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు రూ. 1400 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని ఆప్ ప్రభుత్వం ఆనాడు ఆరోపించినా కేంద్రం లోని బిజెపి సర్కారు కిమ్మనలేదు. ఆప్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బిజెపి పావులు కదుపుతోందని కేజ్రీవాల్ ముందుగానే పసిగట్టారు.

శాసనసభను ప్రత్యేకంగా సమావేశపర్చి తన ప్రభుత్వంపై విశ్వాస ప్రకటనను కోరారు. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి సహకరిస్తే తనను ముఖ్యమంత్రిగా చేస్తానని, తనపై గల కేసులన్నిటినీ రద్దు చేస్తామని కాషాయనాథులు ఆశ చూపించినట్టు సిసోడియా బట్టబయలు చేయడం అప్పుడు తీవ్ర దుమారం రేపింది. అలాగే ఒక్కో ఎంఎల్‌ఎ కి రూ. 20 కోట్లు ఇవ్వచూపారని కేజ్రీవాల్ కూడా ఆరోపించారు. అయితే ఈ దాడులు, సోదాల వల్ల ఆప్ పైన, దాని నాయకుల పైనా చెప్పుకోదగిన బురద ముంచి వేసింది. అంతకుముందు ఆప్ ఆరోగ్య మంత్రి సత్యేంద్రజైన్‌ను అరెస్టు చేశారు. ఆప్ చక్కని పాలన వల్లనే ఢిల్లీ, తదుపరి పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించగలిగింది. ఆప్ విద్యా విధానాన్ని మెచ్చుకుంటూ ఢిల్లీ అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఫోటోతోపాటు ప్రత్యేక కథనాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక 2022 లో మొదటి పేజీలో ప్రచురించడం ప్రత్యేక విశేషం. అయినాసరే 1998 నుంచి ఢిల్లీలో తమ ప్రభుత్వం లేకపోవడం బిజెపి వర్గాలకు నిద్రపట్టకుండా చేసింది.

ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, జెపి నడ్డా తదితర పెద్దలంతా సర్వశక్తులు ఒడ్డారు. ఢిల్లీలో కలుషిత నీరు, రోడ్ల అధ్వాన స్థితిని కూడా కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచార అంశాలుగా వాడుకున్నారు. ఇలాంటి కుట్ర రాజకీయాలే ప్రధాన లక్షంగా దర్యాప్తు సంస్థలను వినియోగించడం వల్ల నిజంగా జరిగిన కుంభకోణాల్లో అవి చేపట్టే పరిశోధనకు విలువలేకుండా పోతుందన్నది వాస్తవం. ఆనాడు మధ్యప్రదేశ్‌లో స్వల్ప మెజారిటీతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలకపక్షంలో సులువుగా చీలిక తెచ్చి బిజెపి కూల్చివేసింది. మహారాష్ట్రలో శివసేనలో కూడా చీలిక తెచ్చి తన పంట పండించుకుంది. గోవాలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంఎల్‌ఎల కొనుగోలుకు కుట్ర పన్నింది. రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాల్లో మాత్రమే అవినీతి చోటు చేసుకుంటున్నట్టు, తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి అవినీతి లేకుండా పాలకులు కడిగిన ముత్యంలా ఉన్నట్టు చూపించడానికి బిజెపి ఎంత తాపత్రయం పడుతుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికైనా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు కుట్రలకు పాల్పడే నేతలకు కనువిప్పు కావలసి ఉంది.