Reading Time: 2 minutes

ఇరుగుపొరుగు దేశాలు పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ మధ్య పోరు తీవ్రతరం అయింది. తమ దేశం అఫ్ఘనిస్థాన్‌పై బహిరంగ ప్రత్యక్ష యుద్ధానికి దిగిందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా శుక్రవారం ప్రకటించారు. తరచూ దాడులకు దిగుతూ, పౌరుల ప్రాణాలను హరిస్తూ వచ్చిన అఫ్ఘనిస్థాన్ తమ ఓపికను పరీక్షిస్తూ వచ్చిందని, ఇక తమ బహిరంగ యుద్ధాన్ని ఎదుర్కొవాలని ఆయన సవాలు విసిరారు. పాక్ సేనలు ఇప్పటికే 130 మందికి పైగా తాలిబన్ సాయుధులు హతులయ్యారని ఇస్లామాబాద్‌లో అధికార వర్గాలు ధృవీకరించాయి. రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ 2611 కిలోమీటర్ల సరిహద్దును దురంద్ రేఖగా వ్యవహరిస్తారు. అయితే అఫ్ఘన్ అధికారికంగా దీనిని గుర్తించలేదు. ఇప్పుడిక తమది ప్రత్యక్ష యుద్ధమే. ఇప్పుడు ఇక దమా దమ్ మస్త్ కలందర్ అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. పాక్ సైన్యం సముద్ర మార్గం మీదుగా విరుచుకుపడదు. ఎంతైనా పొరుగు దేశం కదా? బలాలు బలహీనతలు అని తెలుసు. వీటిని గుర్తించే తగు విధంగా విరుచుకుపడుతామని ప్రకటించారు.

ఇప్పటికే పాక్ సైన్యం ఆపరేషన్ గజబ్ లిల్ హక్ పేరిట అఫ్ఘన్‌లోని పలు ప్రాంతాలపై దాడులకు దిగింది. తమ వైమానిక స్థావరాలు, గ్రామాలపై తాలిబన్ల దాడులకు ప్రతీకారంగానే ఇప్పుడు యుద్థానికి దిగింది. అటువైపు నుంచి కవ్వింపు చర్యలు సాగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? ఏరిపారేస్తామని రక్షణ మంత్రి హెచ్చరించారు. దమా దమ్ మస్త్ కలందర్ సింధ్ సూఫీ ప్రవక్త లాల్ షెబాజ్ కలందర్ ఆధ్మాత్మిక గీతాన్ని ప్రస్తావించారు. రక్షణ మంత్రి ఆసిఫ్ ప్రకటనకు అఫ్ఘన్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి నుంచి స్పందన వెలువడింది. సరిహద్దుల వెంబడి తమ సేనల ప్రతీకార దాడుల్లో 55 మంది పాక్ సైనికులు చనిపోయారని తెలిపారు. పాక్ సైన్యపు రెండు ప్రధాన స్థావరాలను,19 చెక్‌పోస్టులను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మరో వైపు పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ టర్కీ , సౌదీ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిని వివరించారు. పాక్ ..సౌదీ మధ్య గత ఏడాది సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

మూడో దేశం దాడులు జరిగితే వెంటనే పరస్పరం సహకరించాలని ఈ ఒప్పందంలో నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పుడు పాకిస్థాన్‌కు సౌదీ , టర్కీ నుంచి సాయం అందుతుందని వెల్లడైంది. అయితే ఈ రెండు దేశాలూ నేరుగా యుద్ధంలో చేరే అవకాశాలు లేవు. తమ దేశం శాంతి, దేశ ప్రాదేశికత సమగ్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పాక్ అధ్యక్షులు అసీఫ్ అలీ జర్దారీ, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. తమ భూభాగాలపై దాడులకు దిగి అప్ఘన్ చాలా పెద్ద తప్పు చేసింది. ఇక తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.