Reading Time: < 1 minute

 మీసేవ ఆధ్వర్యంలోని ‘మీటికెట్’ యాప్‌లో టిజిఎస్‌ఆర్‌టిసి సేవలను సమగ్రంగా అనుసంధానించడంతో, బస్‌పాస్‌ల కోసం డిపోలు, కౌంటర్ల వద్ద క్యూలు నిలబడే రోజులకు ముగింపు పడనుంది. ప్రభుత్వ మొబైల్ యాప్ ద్వారానే బస్‌పాస్‌లు జారీ చేసే రాష్ట్రంగా తెలంగాణ దేశంలో తొలి రాష్ట్రంగా నిలుస్తోంది. ఆ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. ఐటీ మంత్రి డి. శ్రీధర్‌బాబు నేతృత్వంలో పౌర సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మీటికెట్ యాప్ ఇప్పటికే రెండు లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లు సాధించగా, రూ.2.9 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా 221 ప్రాంతాలు, 190 సేవా కేంద్రాల ద్వారా ఈ వ్యవస్థ విస్తరించినట్లు అధికారులు తెలిపారు. మీసేవ ఈ -గవర్నెన్స్ వ్యవస్థలో భాగంగా రూపొందిన ఈ యాప్ ద్వారా ప్రయాణికులు నగర బస్‌పాస్‌లు, అంతర్రాష్ట్ర టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పొందగలుగుతున్నారు. డిపోలకు వెళ్లడం, ఫారమ్‌లు నింపడం, క్యూలో నిలబడడం వంటి ప్రక్రియలు అవసరం లేకుండానే బస్‌పాస్‌లు జారీ కానున్నాయి. దరఖాస్తు, చెల్లింపు, పాస్ జారీ అన్నీ మొబైల్ ఫోన్ ద్వారానే పూర్తవుతున్నాయి. ప్రతి నెల పాస్ కోసం గంటసేపు క్యూలో నిలబడాల్సి వచ్చేదని, ఇప్పుడు రెండు నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతోంది అని విద్యార్థులు చెబుతున్నారు.