
హైదరాబాద్: లిక్కర్ కేసు విషయంలో రాజకీయ కుట్రతోనే కేసు పెట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికే ఈ కేసు పెట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనను మూడేళ్ల పాటు నానామాటలు అన్నారని, సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని కవిత విమర్శించారు. ఐదున్నర నెలలు జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారని, రాజకీయ కుట్రతోనే కేసు పెట్టారని నిరూపితమైందని తెలియజేశారు. నిజం గెలిచిందని ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు, అత్తామామలు తమకు అండగా నిలిచారని, తనకు అండగా నిలిచిన వారిని మరిచిపోలేనని కవిత పేర్కొన్నారు.