Reading Time: 2 minutes
Israel Slams China Pakistan France Un Iran Secret Deals Hormuz

Israel: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) వేదికగా ఇజ్రాయెల్ రాయబారి సంచలన ఆరోపణలు చేశారు. వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ విధిస్తున్న ఆంక్షల వెనుక కొన్ని దేశాల “రహస్య ఒప్పందాలు” ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఫ్రాన్స్, చైనా, పాకిస్థాన్ ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని ఆయన సంధించిన ప్రశ్నలు దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

READ ALSO: Bhagyashri Borse : ఈ ఏడాదైనా భాగ్యశ్రీ ఖాతాలో హిట్ పడేనా..?

“ఆ చెక్కు మాకు చూపించండి”
హోర్ముజ్ జలసంధిలో ఇతర దేశాల నౌకలను ఇరాన్ అడ్డుకుంటున్నప్పటికీ, కొన్ని దేశాల నౌకలు మాత్రం సురక్షితంగా ఎలా వెళ్తున్నాయని ఇజ్రాయెల్ రాయబారి సూటిగా ప్రశ్నించారు. ఫ్రాన్స్ రాయబారి బోన్‌ఫాన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “ఏప్రిల్ 3న ఫ్రెంచ్ నౌక ఎలా ప్రయాణించగలిగింది? దీని కోసం మీరు ఇరాన్‌కు ఎంత డబ్బు చెల్లించారు? ఆ చెక్కు మాకు చూపించండి” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దౌత్య ప్రోటోకాల్‌ల ముసుగులో ఇరాన్‌తో రహస్య ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

చైనా, పాకిస్థాన్‌ల మౌనం..
చైనా ప్రతినిధి రాయబారి కాంగ్, పాకిస్థాన్ ప్రతినిధి రాయబారి అహ్మద్‌లను కూడా ఇజ్రాయెల్ రాయబారి వదిలిపెట్టలేదు. పాకిస్థాన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీరు ఇరాన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం ఉంది. మరి దానిని ప్రపంచంతో ఎందుకు పంచుకోవడం లేదు?” అని నిలదీశారు. ఇక చైనా గురించి మాట్లాడుతూ.. చైనా నౌకలు కూడా సురక్షితంగా ప్రయాణించేలా ఇరాన్‌తో ఒప్పందం చేసుకున్నాయని, ఈ విషయంలో ఇరు దేశాల మౌనం అనేక సందేహాలకు తావిస్తోందని మండిపడ్డారు.

భద్రతా మండలి వైఫల్యంపై విమర్శలు
ఇలాంటి రహస్య ఒప్పందాలు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, ఇరాన్ వంటి దేశాలను మరింత ప్రోత్సహిస్తాయని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇది భద్రతా మండలి యొక్క అతిపెద్ద వైఫల్యమని ఆయన అభివర్ణించారు. ఇలాంటి చర్యలు ప్రాంతీయ స్థిరత్వానికి, ప్రపంచ నౌకాయాన భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని హెచ్చరించారు. మరోవైపు, హోర్ముజ్ జలసంధిని తాము మూసివేస్తున్నామని, భారత నౌకలతో సహా అన్ని నౌకలు వెంటనే వెనక్కి తిరిగి వెళ్లాలని ఇరాన్ ఆదేశించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఒక ఆడియో రికార్డింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలను మరింత దట్టంగా మార్చుతోంది. ఇరాన్ తన పట్టును బిగిస్తున్న తరుణంలో, ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ చేసిన ఈ ఆరోపణలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీసేలా కనిపిస్తున్నాయి. భారత నౌకల భద్రతపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

READ ALSO: North Korea: రెచ్చిపోయిన ఉత్తర కొరియా.. గజగజ వణుకుతున్న పొరుగు దేశాలు!