Reading Time: 2 minutes

 టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. గురువారం జింబాబ్వేతో జరిగిన సూపర్8 గ్రూప్1 కీలక మ్యాచ్‌లో భారత్ 72 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీస్ ఛాన్స్‌ను మెరుగుపరుచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసి ఔటమి పాలైంది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 97 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, బుమ్రా, హార్దిక్‌లు అద్భుత బౌలింగ్‌ను కనబరిచారు.

ఆరంభం నుంచే..

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మలు శుభారంభం అందించారు. ఇద్దరు దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. ఇటు శాంసన్ అటు అభిషేక్ చెలరేగి ఆడడంతో స్కోరు వేగం పుంజుకుంది. అయితే 15 బంతుల్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 24 పరుగులు చేసిన శాంసన్‌ను ముజరబ్బాని ఔట్ చేశాడు. దీంతో 48 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

అభిషేక్, ఇషాన్ జోరు..

తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి అభిషేక్ మరో కీలక పార్ట్‌నర్‌షిప్‌ను నెలకొల్పాడు. ఇషాన్, అభిషేక్ విధ్వంసక బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. దూకుడుగా ఆడిన అభిషేక్ 30 బంతుల్లోనే 4 సిక్సర్లు, 4 ఫోర్లతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు. ధాటిగా ఆడిన ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 38 పరుగులు సాధించాడు. చేలరేగి బ్యాటింగ్ చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లోనే రెండు సిక్సర్లు, 3 ఫోర్లతో 33 పరుగులు సాధించాడు. చివర్లో తిలక్‌వర్మ, హార్దిక్ పాండ్యలు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు.

ఇద్దరు పోటీ పడి ఫోర్లు, సిక్సర్లు బాదడంతో భారత్ రికార్డు స్కోరును నమోదు చేసింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన తిలక్‌వర్మ 16 బంతుల్లోనే 4 సిక్సర్లు, 3 ఫోర్లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన హార్దిక్ 23 బంతుల్లోనే 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 50 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. దీంతో భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 256 పరుగులకు చేరింది. టి20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.