
Anant Ambani: అంబానీ కుటుంబం అంటేనే విలాసవంతమైన జీవనశైలికి మారుపేరు. తాజాగా భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ధరించిన ఓ అపురూపమైన వాచ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రపంచ ప్రఖ్యాత ‘జాకబ్ అండ్ కో’ (Jacob & Co) రూపొందించిన ‘ఓపెరా గాడ్‌ఫాదర్ బాగుట్ శివ’ వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కేవలం సమయాన్ని చూపే పరికరం మాత్రమే కాదు, భారతీయ ఆధ్యాత్మికతను, అత్యాధునిక సాంకేతికతను మేళవించిన ఒక అద్భుత కళాఖండం.
ధర అక్షరాలా రూ.12 కోట్లు..
ఈ వాచ్ ధర సుమారు రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. దీని తయారీలో వాడిన లోహాలు, రాళ్లు అత్యంత ఖరీదైనవి. ఈ వాచ్ వెలుపలి భాగం 18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో తయారు చేశారు. దీనిపై 300కు పైగా బాగుట్ కట్ వజ్రాలను పొదిగారు. మొత్తం మీద ఈ వాచ్‌లో వెయ్యికి పైగా వజ్రాలు మెరుస్తుంటాయి. వాచ్ మధ్యలో ధ్యాన ముద్రలో ఉన్న పరమశివుడి విగ్రహం కొలువై ఉంది. దీని పక్కనే పవిత్రమైన ‘ఓం’ (ॐ) చిహ్నాన్ని కూడా చూడవచ్చు.
ఈ వాచ్‌లో శివుడి విగ్రహాన్ని అమర్చడం వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. శివుడి ఈ రూపం ప్రశాంతతకు, అంతర్గత శక్తికి నిదర్శనం. నిజమైన ఆనందం బయటి ప్రపంచంలో కాకుండా మన అంతరాత్మలోనే ఉంటుందని ఇది సూచిస్తుంది. సనాతన ధర్మంలో ఓం అనేదానికి ప్రత్యేకమైన స్థానం. ఇది సానుకూల శక్తిని, ఆధ్యాత్మిక మేల్కొలుపును కలిగిస్తుందని భక్తుల నమ్మకం. సాంకేతికపరంగా కూడా ఈ వాచ్ ఒక అద్భుతం. ఇందులో 658 చిన్న చిన్న భాగాలు ఉంటాయి. సమయాన్ని అత్యంత కచ్చితంగా చూపడంలో ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. ఇదొక మ్యూజికల్ వాచ్. ఒక చిన్న బటన్ నొక్కితే చాలు.. ‘ది గాడ్‌ఫాదర్’ సినిమాలోని ప్రసిద్ధ సంగీతం ప్లే అవుతుంది. ఈ మ్యూజిక్ వస్తున్నప్పుడు వాచ్ లోపలి భాగాలు కదిలే తీరు చూసేవారిని అబ్బురపరుస్తుంది. అనంత్ అంబానీకి ఖరీదైన గడియారాలంటే చాలా ఇష్టం. ఆయన వద్ద ఉన్న వాచ్‌ల కలెక్షన్ విలువ రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. గతంలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా అనంత్ వాచ్ కలెక్షన్‌ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసించిన విషయం తెలిసిందే.