
Cancer Awareness: క్యాన్సర్.. ఈ పేరు వింటేనే సామాన్యులు భయపడతారు. అయితే ఈ వ్యాధి కంటే ప్రమాదకరమైనది ‘నిర్లక్ష్యం’. భారతదేశంలో నమోదవుతున్న గర్భాశయ, ఊపిరితిత్తుల, నోటి, రొమ్ము క్యాన్సర్ కేసులు చాలా వరకు ముదిరిన దశలో వెలుగుచూడటానికి కారణం.. ప్రారంభ లక్షణాలను చిన్న సమస్యలుగా భావించి వదిలేయడమే అని నిపుణులు చెబుతున్నారు. అసలు ప్రారంభ దశలో శరీరంలో క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలను ఎలా గుర్తించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
క్యాన్సర్ అరుదుగా మాత్రమే తీవ్రమైన నొప్పితో బయటపడుతుంది. మెదాంత హాస్పిటల్‌లోని సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అంకుర్ నందన్ వర్ష్నీ ప్రకారం.. మనం సాధారణమని భావించే కొన్ని మార్పులే ప్రాణాంతక వ్యాధికి హెచ్చరికలు కావచ్చని చెప్పారు. ఆయన సూచించిన ఆ 5 ముఖ్యమైన సంకేతాలు ఇవే..
చాలా మంది గడ్డ అంటే నొప్పి ఉంటుందని భావిస్తారు. కానీ రొమ్ము, మెడ, చంకలు లేదా వృషణాలలో నొప్పి లేకుండా వచ్చే గడ్డలే క్యాన్సర్‌కు ప్రధాన సూచికలు. నొప్పి లేదు కదా అని నిర్లక్ష్యం చేస్తే, అది శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉంది. కొత్తగా ఏదైనా కణితి కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెప్పారు. భారతదేశంలో పొగాకు వాడకం వల్ల నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మీ నోటిలో, చిగుళ్లపై లేదా నాలుకపై వచ్చే పుండ్లు రెండు వారాల కంటే ఎక్కువ కాలం తగ్గకుండా ఉంటే, అది ప్రమాద సంకేతంగా గుర్తించాలన్నారు. 10 నుంచి 14 రోజుల్లో నయం కాని పుండ్లను సాధారణ అల్సర్లుగా భావించవద్దని సూచించారు.
స్పష్టమైన కారణం లేకుండా శరీరంలోని ఏ ద్వారం నుంచి రక్తస్రావం జరిగినా అది ఆందోళనకరమే అని అన్నారు. నెలసరి సమయం కాకుండా అసాధారణ యోని రక్తస్రావం గర్భాశయ క్యాన్సర్‌కు సూచన కావచ్చని చెప్పారు. దగ్గినప్పుడు కఫంలో రక్తం పడటం, మూత్రం లేదా మలంలో రక్తం కనిపించడం వంటి వాటిని వెంటనే పరీక్ష చేయించుకోవాలన్నారు. వాతావరణ కాలుష్యం లేదా ఇన్ఫెక్షన్ల వల్ల దగ్గు రావడం సహజం. కానీ మూడు వారాలకు మించి దగ్గు తగ్గకపోవడం, గొంతులో మార్పు రావడం లేదా మింగడంలో ఇబ్బంది కలగడం వంటివి ఊపిరితిత్తులు, గొంతు లేదా అన్నవాహిక క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలు కావచ్చని సూచించారు. ముఖ్యంగా ధూమపానం చేసేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. మీరు ఆహారం తగ్గించకుండానే అకస్మాత్తుగా బరువు తగ్గుతున్నారా? విశ్రాంతి తీసుకున్నా తగ్గని నిరంతర అలసట వేధిస్తోందా? అయితే అది రక్త క్యాన్సర్ లేదా జీర్ణకోశ క్యాన్సర్‌కు తొలి సూచన కావచ్చని చెప్పారు. దీనిని కేవలం పని ఒత్తిడిగా భావించి పొరపడకండి.
ముందస్తు గుర్తింపుతోనే ప్రాణాపాయం తప్పుతుంది..
“క్యాన్సర్ విషయంలో నొప్పి కంటే నిశ్శబ్దమే ఎక్కువ ప్రమాదకరం. వ్యాధి ముదిరే ముందే శరీరం మనకు కొన్ని సూక్ష్మమైన సంకేతాలను పంపుతుంది. వాటిని సరైన సమయంలో గుర్తిస్తే చికిత్స సులభం కావడమే కాకుండా, ప్రాణాలను కాపాడుకునే అవకాశం 90% మెరుగుపడుతుంది” అని డాక్టర్ వర్ష్నీ చెప్పారు. మీ శరీరంలో వచ్చే చిన్న మార్పును కూడా గమనించండి. అవగాహనే క్యాన్సర్ పై పోరాటంలో మనకున్న అతిపెద్ద ఆయుధం అని అన్నారు.