Reading Time: 2 minutes
Off The Record About Ysrcp Internal Buzz Why Are Former Mlas Jyothula Chanti Babu And Varupula Subba Rao Silent

Off The Record: జగ్గంపేట మాజీ శాసనసభ్యుడు జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు ఎక్స్‌ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు…. 2019 నుంచి 2024 వరకు వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహించి బాగానే అధికారం చెలాయించారు. కానీ… గత ఎన్నికల్లో చంటిబాబుకు ఛాన్స్‌ ఇవ్వలేదు ఫ్యాన్ పార్టీ అధిష్టానం. ఇక వరుపుల పోటీ చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. దాంతో ఎన్నికల తర్వాత ప్రత్తిపాడు పార్టీ బాధ్యతల్ని ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరికి అప్పగించారు. చంటిబాబు అయితే… ఎలక్షన్‌ టైం నుంచే పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటు వరుపుల సుబ్బారావు కూడా… ఫలితాల తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే పార్టీ సమావేశాలకు హాజరయ్యారై ఓవరాల్‌గా టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారు. పార్టీ అధినాయకత్వం మాత్రం ఇద్దరికీ సీఈసీ మెంబర్స్‌గా అవకాశం ఇచ్చింది. కానీ… ఎవరూ యాక్టివ్‌గా ఉండటంలేదంటూ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ద్వితీయ శ్రేణి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. క్షేత్ర స్థాయిలో తిరగకుండా, సౌండ్‌ లేకుండా ఉండటం చూసి అసలు వీళ్లిద్దరూ పార్టీలో ఉన్నారా? లేదా? అని అనుచరులే చర్చించుకుంటున్నారట. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకుంటే…. ఎవరు బతిమాలారు…? అదే సంగతిని పెద్దలకు చెప్పేసి తప్పుకుంటే… ఆ పదవుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి.

అధిష్టానం కూడా ఇంట్రస్ట్‌ లేని, పర్ఫార్మెన్స్‌ లేని వాళ్ళను పట్టుకుని వేలాడ్డం ఎందుకు? వాళ్ళకు బదులు కమిట్మెంట్‌తో పని చేసే వాళ్లకు ప్రయారిటీ ఇస్తే ఉపయోగం ఉంటుంది కదా అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. అయితే… ఈ విషయంలో ఇద్దరు మాజీల వెర్షన్‌ వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో…. వాళ్ల వాదన వాళ్ళకు ఉంది. సొంత నియోజకవర్గాల్లో సింగిల్‌గా పనిచేసే ఛాన్స్ ఇవ్వడం లేదు, జగ్గంపేటలో తోట నరసింహం, ప్రత్తిపాడులో ముద్రగడ పార్టీ తరఫున రాజకీయాలు చేస్తున్నప్పుడు మేం సైడ్ క్యారెక్టర్స్‌ వేయాల్సిన ఖర్మఏంటని అడుగుతున్నారట. వాళ్లకి, మాకు పడదబ్బా అంటూ…డైరెక్ట్‌గానే అనేస్తున్నట్టు సమాచారం. అయినా… ఇవన్నీ ఇప్పుడెందుకు, ఎన్నికలకు ముందు అప్పడున్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుందాంలే అంటూ తేలిగ్గా కొట్టి పారేస్తున్నారట. వైసీపీ సీఈసీ మెంబర్స్ గా అవకాశం ఇచ్చింది కదా అంటే…. వాటి వల్ల మాకు, ఆ బిరుదులు తగిలించుకుంటే మా వల్ల పార్టీకి ఏం ఉపయోగం ఉండబోదని క్లారిటీ ఇచ్చేస్తున్నారు ఇద్దరు ఎక్స్‌ ఎమ్మెల్యేలు. ఎలక్షన్‌ టైంలో తీసుకునే నిర్ణయాలు, ఉండే ట్విస్ట్‌లను బట్టి చూద్దామని జ్యోతుల, వరుపుల అంటుంటే…పార్టీ పెద్దలు మాత్రం అంత వెయిట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఉద్దేశ్యంతో ఉన్నట్టు తెలిసింది. తాజా మాజీ ఎమ్మెల్యేలుగా ఏదో… ఒక పదవి తగిలించాం, కంటిన్యూ అయితే తర్వాత చూద్దామని అంటున్నట్టు తెలుస్తోంది. వాళ్ల పర్ఫామెన్స్ ఆధారంగానే మన ఈక్వేషన్స్ ఉంటాయని కూడా గుర్తు చేస్తున్నారట పెద్దలు.

నచ్చితే వచ్చి పనిచేయనివ్వండి, లేదంటే వదిలేయండని నియోజకవర్గ నాయకులకు తాడేపల్లి నుంచి స్ట్రాంగ్‌ డైరెక్షన్‌ వచ్చినట్టు తెలిసింది. అందుకే జిల్లా నేతలు కూడా ఆ ఇద్దర్నీ అంతగా కలుపుకునే ప్రయత్నం చేయడం లేదని అంటున్నారు. కంటిన్యూ అవమని ఒక అవకాశం ఇచ్చారు, ఉపయోగించుకుంటే వాళ్లకే మంచిది, లేదంటే కొత్త వారికి అవకాశాలు వస్తాయే తప్ప అనవసరపు డిస్ట్రబెన్స్‌ను అంగీకరించే ప్రసక్తే లేదని అంటున్నట్టు సమాచారం. అలా…. మొత్తానికి ఈ ఇద్దరు ఎక్స్‌ ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నట్టా లేనట్టా అన్న చర్చ జరుగుతోంది. వాళ్ళు మాత్రం… ఏదైతే అదవనివ్వండి, లేని పదవుల్ని పట్టుకుని వేలాడుతూ…. ఇప్పట్నుంచి ఓ… తెగ పూసేసుకుని చేతి చమురు వదిలించుకోవడం అవసరమా అంటున్నారట. జంక్షన్‌లో ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల పొలిటికల్‌ కెరీర్‌ ఏ టర్న్‌ తీసుకుంటుందో చూడాలి.