Reading Time: < 1 minute
Andhra Pradesh Weather Rains Heatwave Low Pressure Alert

AP Weather: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తర తమిళనాడు నుండి రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ఫలితంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు సంభవించనున్నాయి.

ద్రోణి ప్రభావంతో రేపు (బుధవారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు , తిరుపతి జిల్లాల్లో వర్ష సూచన ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, కూలీలు , పశువుల కాపరులు చెట్ల కింద ఉండవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

వర్ష సూచన ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగనుంది. రేపు అల్లూరి జిల్లాలోని జీకేవీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాల్లోనూ.. అలాగే పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం , గుర్తేడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. నేడు నమోదైన గణాంకాల ప్రకారం కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 42.9°C ఉష్ణోగ్రత రికార్డైంది. ఇతర ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి:

నంద్యాల (కొత్తపల్లి): 42.4°C
పోలవరం (ఎర్రంపేట): 42°C
ప్రకాశం (కొప్పెరపాడు): 41.9°C
మర్కాపురం (కంభం): 41.7°C
పల్నాడు (గురజాల): 41.3°C
అనంతపురం, కడప ప్రాంతాల్లో: 41.1°C

వాతావరణం అస్థిరంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలను పాటించాలని ప్రభుత్వం కోరుతోంది.